త్రిభువన్ బీర్ బిక్రమ్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిభువన్ బీర్ బిక్రమ్ షా(त्रिभुवन वीर विक्रम शाह), (జూన్ 30, 1906 – మార్చి 13, 1955) 11 డిసెంబర్ 1911 నుంచి దాదాపు 45 సంవత్సరాల పాటు నేపాల్ ను పరిపాలించిన రాజు. నేపాల్ రాజధాని నగరం ఖాట్మండులో జన్మించిన ఆయన తన ఐదేళ్ళ వయసుకే తండ్రి పృథ్వీ బీర్ బిక్రమ్ షా మరణానంతరం సింహాసనం ఎక్కారు, 20 ఫిబ్రవరి 1913న ఖాట్మండులో నాసల్ చౌక్, హనుమాన్ ధోకా ప్యాలెస్ లో ఆయన తండ్రి రాజప్రతినిధిగా ఉండగా త్రిభువన్ పట్టాభిషిక్తుడు అయ్యారు, అప్పటికి రాజు స్థానం ప్రధానంగా నామమాత్రమే, దేశంలో నిజమైన అధికారం శక్తిమంతులైన, వంశపారంపర్య ప్రధాన మంత్రులైన రాణా కుటుంబంలో ఉండేది. రాణాల కాలం పాలకుల నిరంకుశత్వం, అణచివేత, ఆర్థిక దోపిడీ, మత హింసకు పేరుపడింది.[1][2]

కుటుంబం

[మార్చు]

త్రిభువన్ మహారాజు జూన్ 30, 1906లో పృథ్వీ బీర్ బిక్రమ్ షా, రాణి దివ్యేశ్వరీ లక్ష్మీ దేవి షా దంపతులకు జన్మించారు. తండ్రి పృథ్వీ బీర్ బిక్రమ్ షా మరణానంతరం త్రిభువన్ డిసెంబర్ 11, 1911న ఎనిమిదేళ్ళ వయసులో సింహాసనం ఎక్కారు. ఆయనకు వయసు వచ్చేవరకూ తల్లి రాణి దివ్యేశ్వరీ లక్ష్మీదేవి రాజప్రతినిధిగా నియమితులయ్యారు. ఖాట్మండులోని నారాయణహితీ రాజప్రాసాదంలో మార్చి 1919న ముందు కాంతి రాజ్యలక్ష్మీదేవిని,[3] అదే రోజు తర్వాత ఈశ్వరీ రాజ్యలక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు.

త్రిభువన్ మహారాజుకు ముగ్గురు కుమారులు, 13 మంది కుమార్తెలు. కుమారుల్లో మహేంద్ర బీర్ బిక్రమ్ షా పెద్దవారు, తర్వాతికాలంలో నేపాల్ రాజు అయ్యారు. ఆయన రాణి కాంతికి 1921లో జన్మించారు. మిగిలిన కుమారుల్లో కాంతి రెండవ కుమారుడు హిమాలయ ప్రతాప్ బీర్ బిక్రమ్ షా, రాణి ఈశ్వరి ఏకైక కుమారుడు బసుంధర బీర్ బిక్రమ్ షా ఉన్నారు. కుమార్తెల్లో రాణి కాంతికి జన్మించిన త్రైలోక్య, నళిని, విజయ, భారతి ఉన్నారు. చిన్న భార్యల కుమారుల్లో రాజకుమారి, దివ్యేశ్వరి, ప్రజ, అచల, తిక, బిమల ఉన్నారు.

తర్వాతి జీవితం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రాణాలకు, రాజకుటుంబానికి మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. రాణాలు నేపాల్ దక్షిణాన ఉన్న భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటీష్ వారికి మద్దతుగా యుద్ధంలో చేరాలని భావించారు. చివరికి ప్రధాన మంత్రి చంద్ర షంషేర్ జంగ్ బహదూర్ రాణా మాట నెగ్గడంతో యుద్ధంలో సైన్యాలు పాల్గొన్నాయి.

1930 మధ్యకాలానికి ప్రజల్లో రాణాల పట్ల అసంతృప్తి పెరగడంతో ఉద్యమాలు చెలరేగాయి, ప్రజాపరిషద్ ఏర్పడింది. రాణాలను పదవి నుంచి తప్పించేందుకు త్రిభువన్ మహారాజు ప్రజాపరిషద్ ను, ప్రజా ఉద్యమాలను సమర్థించారు. ఐతే ఈ సందర్భాల్లో రాణాలు తీవ్రంగా స్పందించి ఉద్యమాలను అణచివేసి, నాయకులను చంపించివేశారు.

త్రిభువన్ మహారాజు ప్రజాపరిషద్ తో సన్నిహితంగా పనిచేసి రాణాల పాలన రద్దుచేసేందుకు కృషిచేశారు. దాదాపు శతాబ్ది కాలం నుంచి నేపాల్ ను పరిపాలిస్తున్న రాణాల పాలనకు ముగింపు పలికే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరడంతో రాణాల నుంచి కాపాడుకునేందుకు గాను 1950 నవంబరులో భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. ఆయనతో పాటుగా శరణార్థులుగా వచ్చిన రాజకుటుంబీకుల్లో కుమారుడు మహేంద్ర, పెద్ద మనవడు బీరేంద్ర ఉన్నారు. ప్రధాన మంత్రి మోహన్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా ఈ పరిణామాలకు అసహనం చెందడంతో అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని సింఘ దర్బారులో 7 నవంబరు 1950న ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 4 సంవత్సరాల త్రిభువన్ మనవడు జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షాను నేపాల్ తర్వాతి రాజుగా ప్రకటించారు. అదేరోజు మధ్యాహ్నం హుటాహుటిన రాకుమారుడు జ్ఞానేంద్రను హనుమాన్ ధోకా ప్రాసాదానికి తీసుకువచ్చి నేపాల్ రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు.[4] నవంబరు 10న రెండు భారతీయ విమానాలు గాచర్ విమానాశ్రయంలో దిగి, జ్ఞానేంద్రను తప్ప మిగతా రాజకుటుంబాన్ని తీసుకుని కొత్త ఢిల్లీ వెళ్ళిపోయాయి. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ త్రిభువన్ మహారాజును లాంఛనపూర్వకంగా ఆహ్వానించారు. రాజును తప్పించడం తీవ్రస్థాయిలో ఆందోళనలకు ఆజ్యంపోసింది. దీనివల్ల ప్రధాని మోహన్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా త్రిభువన్ తోనూ, నేపాలీ కాంగ్రెస్ తోనూ చర్చలకు దిగివచ్చారు. నవంబర్ 22న భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికారికంగా ప్రకటన చేస్తూ జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షాను నేపాల్ కు న్యాయబద్ధమైన మహారాజుగా భారతదేశం గుర్తించబోవట్లేదన్నారు. మోహన్ షంషేర్ పరిస్థితి తన చేయిదాటిపోయిందని గమనించి రాజు బావమరిది,[5] సర్ కైసర్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా, బిజయ షంషేర్ జంగ్ బహదూర్ రాణాలను న్యూఢిల్లీకి శాంతి చర్చల నిమిత్తం పంపారు. న్యూఢిల్లీలో త్రిభువన్ మహారాజు, నేపాలీ కాంగ్రెస్ ప్రతినిధులు, రాణా ప్రభుత్వం కూర్చొని పరిస్థితిని చర్చించారు. చివరికి త్రిభువన్ మహారాజు తన నాయకత్వంలో నేపాలీ కాంగ్రెస్ వారిని, రాణాలను సమాన సంఖ్యలో కొత్త ప్రభుత్వం, మంత్రివర్గం ఏర్పరచాలని నిర్ణయమైంది. త్రిభువన్ మహారాజు, తన కుటుంబసభ్యులు, కాంగ్రెస్ ప్రతినిధులతో సహా ఫిబ్రవరి 18, 1951న నేపాల్ కు మహారాజుగా చేరుకున్నారు. మూడురోజుల అనంతరం త్రిభువన్ అధికారికంగా రాణా పాలన అంతమైనట్టు, ప్రజాస్వామ్యం ఏర్పరుస్తూ ప్రకటించారు. ఐతే మరికొన్ని  నెలల పాటు మోహన్ షంషేర్ ప్రధాన మంత్రిగా కొనసాగేలా నిర్ణయించారు.

References

[మార్చు]
  1. Dietrich, Angela (1996). "Buddhist Monks and Rana Rulers: A History of Persecution". Buddhist Himalaya: A Journal of Nagarjuna Institute of Exact Methods. Archived from the original on 1 అక్టోబరు 2013. Retrieved 17 September 2013.
  2. Lal, C. K. (16 February 2001). "The Rana resonance". Nepali Times. Archived from the original on 28 సెప్టెంబరు 2013. Retrieved 17 September 2013.
  3. "King Tribhuvan and Queen Kanti". Archived from the original on 2017-05-10. Retrieved 2016-11-29.
  4. Cheena
  5. Royal Ark (Prithvi) & Royal Ark (Tribhuvan)