ధూళిపాళ (నటుడు)

వికీపీడియా నుండి
(ధూళిపాళ సీతారామశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధూళిపాళ
నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ
జననంధూళిపాళ సీతారామ శాస్త్రి
సెప్టెంబర్ 24, 1922
దాచేపల్లి
మరణంఏప్రిల్ 13, 2007
గుంటూరు
మరణ కారణంఊపిరితిత్తుల వ్యాధి
ఇతర పేర్లుధూళిపాళ, మారుతీ సేవేంద్ర సరస్వతి
వృత్తినటుడు
పిల్లలుఇద్దరు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు
తండ్రిశంకరయ్య
తల్లిరత్నమ్మ
వెబ్‌సైటు
http://www.dhulipala.org/

ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.

జననం

[మార్చు]

ధూళిపాళగా పిలవబడే ఈయన ఉమ్మడి( గుంటూరు జిల్లా) ప్రస్తుత పల్నాడు జిల్లా దాచేపల్లిలో 1922 సెప్టెంబర్ 24 న జన్మిచాడు. 2001లో సన్యాస ఆశ్రమం స్వీకరించి శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతిగా మారిపొయాడు.[1]

నట జీవితం

[మార్చు]

చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు గారు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.

పురస్కారాలు

[మార్చు]

నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.
  • బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.
  • అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ 2007 లో ప్రతిభా పురస్కారం అందజేసింది.
  • తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువు’ అని అభివర్ణించారు. అంటే... నటనలో పులి...నడతలో (నిజజీవితంలో) గోవు అని అర్ధం.

ఇంకా, సాంస్కృతిక సంఘాలు, సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి

ఆధ్యాత్మిక జీవితం

[మార్చు]

నటరాజ సేవలో తరించిన ధూళిపాళ చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రితం సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, అయితే మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మానవసేవే లక్ష్యంగా సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదను త్యజించారు. 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూరు మారుతీ నగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి, రామాయణం, సుందరకాండలను తెలుగు లోకి తిరిగి వ్రాశారు. ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తూ, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు. మూడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, శేషజీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపాడు ధూళిపాళ.

మరణం

[మార్చు]

ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు.

నటించిన సినిమాలు

[మార్చు]

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 92.

బయటి లింకులు

[మార్చు]