(Translated by https://www.hiragana.jp/)
అవీ..ఇవీ...అన్నీ...: Culture
The Wayback Machine - https://web.archive.org/web/20160221070010/http://aviiviannee.blogspot.in/search/label/Culture
Showing posts with label Culture. Show all posts
Showing posts with label Culture. Show all posts

Tuesday, May 15, 2012

సామాజిక సైట్లలో ‘అసాంఘిక’ ధోరణులు!



ఎక్కడెక్కడో ఉన్నవారిని స్నేహ బంధంతో ఏకం చేస్తూ, పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు దోహదపడుతున్న సామాజిక వెబ్‌సైట్లలో ఇటీవల పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ సామాజిక సైట్లలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నందున బంధుత్వాలు సైతం దెబ్బ తింటున్నాయి. ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో కొందరు అనైతిక ‘పోస్టింగ్‌లు’ పెడుతున్నందున అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి నిశ్చితార్థాలు రద్దుకావడం, విభేదాల కారణంగా దంపతులు విడాకులకు సిద్ధం కావడం వంటి విపరిణామాలకు ‘ఫేస్‌బుక్’ కారణమవుతోంది. ఇందు కు పలు సంఘటనలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. బి-్ఫర్మసీ చదివిన విద్యార్థినికి బ్రిటన్‌లో ఉంటూ ఎంటెక్ చదివిన ఒక యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఆ యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలితో ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష మయ్యాయి. ఈ ఫోటోలు చూశాక నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్టు ఆ విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ప్రకటించారు. ఫొటోలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం తప్ప ఎలాంటి ‘సంబం ధం’ లేదని ఆ యువకుడు పదేపదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొమ్మిదేళ్లుగా కాపురం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు సామాజిక వెబ్‌సైట్ పుణ్యమాని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన స్నేహితురాలి ఫోటోకు సంబంధించి భర్త రాసిన కామెంట్లను ఆ గృహిణి సహించలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లోని ఫ్యామిలీ కోర్టులలో ఇలాంటి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఫోటోల్లోని ముఖ భాగాలను తారుమారు చేస్తూ వాటిని వెబ్‌సైట్లలో పెడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అభ్యంతరకరమైన రాతలు, ఫోటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో దాంపత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని న్యాయవాదులు సైతం అంగీకరిస్తున్నారు.
మరో సంఘటనలో తమ కాబోయే కోడలి గురించి ఫేస్‌బుక్‌లో రాసిన వ్యాఖ్యానాలు చదివి కోయంబత్తూరుకు చెందిన ఓ దంపతులు తమ కుమారుడి వివాహాన్ని రద్దు చేశారు. స్నేహితులతో కలిసి తీయించుకున్న ఫోటోలో ఆ అమ్మాయి గురించి చెడుగా కామెంట్లు రాసి ఎవరో బయటి వ్యక్తులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ఆకతాయి చేష్ట కారణంగా పెళ్లి రద్దు కావడంతో యువతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. వారంరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కాబోయే వధువు కొంతమంది యువకులతో కలిసి ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం.
సామాజిక వెబ్‌సైట్లలో పోస్టింగులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంవల్లనే ఈ దుస్థితి నెలకొందని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. కొందరి బరితెగింపు కారణంగా కుటుంబ వ్యవస్థ, వివాహ బంధాలు విచ్ఛిన్నం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సైట్లలో నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా అనైతిక చర్యలకు పాల్పడితే అనర్థాలు తప్పవని, ముఖ్యంగా యువత దీనిని గ్రహించాలని మానవ సంబంధాల నిపుణులు సూచిస్తున్నారు.
Courtesy : Andhrabhoomi.net

Thursday, May 3, 2012

ఎటుపోతోంది ఈ ప్రేమోన్మాదం ...



‘ప్రేమ’ అనే రెండక్షరాలకు ఇరు హృదయాలను కలపడమే కాదు.. మనసుల్ని గాయపరచడం, మనుషుల్ని హతమార్చడం కూడా తెలుసు. ప్రేమ ఉన్మాదంగా మారడంతో దేశ వ్యాప్తంగా పలురకాల నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక దాడులు, సంఘ బహిష్కరణలు, ‘పరువు హత్య లు’ వంటి నేరాలకు ప్రేమే కారణం కావడం పట్ల సామాజిక వేత్తలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కట్టుబాట్లకు కాలం చెల్లిపోవడం వంటి పరిస్థితుల్లో ప్రేమ పేరిట విచ్చలవిడి శృంగారం, అనైతిక సంబంధాలు నానాటికీ అధికమవుతున్నాయి.
ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్నప్పటికీ, తమిళనాడులో ప్రేమోన్మాద నేరాల సంఖ్య పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రేమలు, లైంగిక సంబంధ నేరాల సంఖ్య చెన్నై నగరంలో ఇటీవలి కాలంలో 125 శాతం పెరిగినట్లు పోలీసుశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా నేరాలు 2008లో 155 నమోదు కాగా, 2011లో ఆ సంఖ్య 341కు చేరడం గమనార్హం. ప్రేమ సంబంధ వ్యవహారాలతో పేరుకుపోతున్న హత్యలు, ఆత్మహత్యలు, దాడుల కేసులను పరిష్కరించడం పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. ప్రేమను కాదన్న యువతులను హత్య చేయడం, పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడడం, కులాంతర ప్రేమకు సిద్ధపడిన కుమార్తెలను తల్లిదండ్రులే కడతేర్చడం వంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతునే ఉన్నాయి.
ఈ తరహా నేరాలు క్షణికావేశంలోనే అధికంగా జరుగుతున్నందున వీటిని ముందుగా పసికట్టడం అసాధ్యమని పోలీసులు అంటున్నారు. ప్రేమ వ్యవహారాల్లో మానసికంగా దెబ్బతిన్న వారు ఎప్పుడు, ఏ రకంగా నేరం చేస్తారో ఎవరికీ తెలియదని వారు చెబుతున్నారు. ప్రేమోన్మాదంతో ప్రవర్తించే వారి కదలికలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులే కనిపెట్టాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరం జరిగిన తర్వాతే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తుంటాయని, ఈ తరహా నేరాలను ముందుగా అంచనాకు రావడం సాధ్యం కాదని పోలీసులు విశే్లషిస్తున్నారు. కాగా, సమాజ పరమైన కట్టుబాట్ల వల్ల కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు కనుమరగవడం, కోర్టుకు వచ్చేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తగ్గుతున్నట్లు కూడా పోలీసులు అంగీకరిస్తున్నారు.
సెల్‌ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్, సామాజిక వెబ్‌సైట్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది అనైతిక పనులను వాడుకోవడం వల్ల నేరాల సంఖ్య పెచ్చుమీరుతోందని మానసిక విశే్లషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతం కావడంతో కొంతమంది యువతీ యువకుల్లో విచ్చలవిడితనం పెరిగినట్లు సామాజిక వేత్తలు గుర్తించారు. ఎదిగిన పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచే పరిస్థితులు నేడు అంతగా లేకపోవడంతో ప్రేమ వ్యవహారాల ఆచూకీ అంతుపట్టడం లేదు. తాత్కాలిక ఆనందాల కోసం నైతిక విలువలను విస్మరించడం వల్లే ఈ దుర్గతి నెలకొందని, యువత పెడ ధోరణులతో కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయని విద్యావేత్తలు సైతం ఆవేదన చెందుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ సంస్కృతి కారణంగా ‘లక్ష్మణరేఖ’ను దాటేందుకు యువత ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఏకపక్ష ప్రేమలు, ముక్కోణపు ప్రేమలు, వివాహేతర సంబంధాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. కాగా, విడాకులకు సంబంధించి విదేశీ సంస్కృతి ప్రభావంతో కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం విడిపోయేందుకు జంకడం లేదు.
ఇక ప్రేమలు, పెళ్లిళ్లు, లైంగిక విజ్ఞానం వంటి విషయాలపై యువతలో తగిన అవగాహన కల్పించేందుకు కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా గానీ ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. మానసిక అపరిపక్వతతో యువతీ యువకులు క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి విషయాలకు విద్యా బోధనలో ఎక్కడా చోటు లేకపోవడంతో ప్రేమోన్మాద సంస్కృతి పెచ్చుమీరిపోతోందని మానసిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Source: Andhrabhoomi

Saturday, April 7, 2012

ఈస్టర్ విశేషాలు (రేపు ఈస్టర్ పండుగ)


ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి.

 
ఇమేజ్  
మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక ఏప్రిల్ 4 నుండి మే 8 మధ్యలో ఈస్టర్ వస్తుంది. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక  మార్చ్22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో ఈస్టర్ వస్తుంది.

 
ఇమేజ్  

ఈస్టర్ లూనిసోలార్ కేలండర్ ను అనుసరించి జరుపుకుంటారు. లూనిసోలార్ కేలండర్ అంటే చంద్రుని స్థితిని, సౌరసంవత్సర సమయాన్ని రెండింటినీ తెలియచేస్తుంది. జూలియన్ మరియు గ్రెగోరియన్ కేలండర్స్ రెండూ సౌరమానం ప్రకారమే పనిచేస్తాయి. ఎందుకంటే అవి భూపరిభ్రమణాన్ని బట్టి భూమి యొక్క స్థితిని తెలియచేస్తాయే కానీ చంద్రుడి స్థితిని కాదు. అయినప్పటికీ ఈస్టర్ తేదిని మాత్రం లూనిసోలార్ కేలండర్ ను అనుసరించే ఖరారు చేస్తాయి.

క్రైస్తవ్యాన్ని పాటించే అనేక దేశాలలో  ఈస్టర్ మర్నాడు సోమవారం కూడా సెలవు. దీనిని ఈస్టర్ మండే అంటారు. 

గ్రెగోరియన్ ఈస్టర్ 35 తేదీలలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏప్రిల్ 19 న ఈస్టర్ ఎక్కువసార్లు అంటే 2,20,400 సార్లు వస్తుంది. మిగిలిన అన్ని తేదీలు కలిపి సరాసరిన 1,89,525 సార్లు వస్తాయి. ఈస్టర్ చ్రక్రం ప్రతి 57 లక్షలకొకసారి పునరావృతమవుతుంది.

ఈస్టర్ మార్చ్22 న క్రీ.శ. 1818 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2285 వసంవత్సరంలో వస్తుంది. అలాగే ఏప్రిల్ 25 న క్రీ.శ. 1943 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2038 వసంవత్సరంలో వస్తుంది.

కొన్నిసార్లు తూర్పు దేశాల క్రైస్తవులు మరియు పశ్చిమ దేశాల క్రైస్తవులు ఒకే తేదిన ఈస్టర్ జరుపుకోవటం జరుగుతుంది. 2011 ఈస్టర్ (ఈరోజు) అటువంటివాటిలో ఒకటి. 1984 ఏప్రిల్ 22, 1987 ఏప్రిల్ 19, 1990 ఏప్రిల్ 15, 2001 ఏప్రిల్ 15, 2004 ఏప్రిల్ 11, 2007 ఏప్రిల్ 8, 2010 ఏప్రిల్ 4, 2014 ఏప్రిల్ 20, 2017 ఏప్రిల్ 16 మరికొన్నిఅటువంటి రోజులు.

ప్రతి సంవత్సరం తొంభై మిలియన్ల చాకొలేట్ ఈస్టర్ బన్నీస్ తయారవుతాయి. 
 

ఈస్టర్ కోసం 16 బిలియన్ల జెల్లీ బీన్స్ తయారవుతాయి. పిల్లలు ఎరుపు జెల్లీ బీన్స్ ను ఇష్టపడతారు. 
 
చాకోలేట్ తో చేసిన ఈస్టర్ ఎగ్స్, జెల్లీ బీన్స్ వంటివి తింటారు. 
 
ఇమేజ్ 
విదేశాలలో ఈస్టర్ రోజు గ్రుడ్లను దొర్లించే ఆట చాలా ప్రసిధ్దమైనది. 

అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.
( ఈ పోస్టును దర్పణం బ్లాగునుంచి సేకరించడం జరిగింది. రచయితకు ధన్యవాదాలు )

Friday, December 30, 2011

మిమిక్రీ ‘మణి’కంఠుడు నేరెళ్ల!


తెలుగుగడ్డపై జన్మించి, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మిమిక్రీ ‘గళాన్ని’ వినిపించిన ఏకైక కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. అమెరికా, రష్యా, కెనడా సహా ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రదర్శనలిచ్చి మిమిక్రీ కళాప్రక్రియకు ఖండాతర ఖ్యాతిని ఆర్జించిన ‘మణిమకుటం’ వేణుమాధవ్. 1932 డిసెంబర్ 28న వరంగల్లు పట్టణంలో కళ్లు తెరిచిన నేరెళ్ల 1947లో పదిహేనేళ్ల పిన్న వయసులో మిమిక్రీని కళగా స్వీకరించి అనతికాలంలోనే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు స్వయంకృషితో మిమిక్రీని దేశవ్యాప్తంగా ప్రదర్శించి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీ’గా ప్రఖ్యాతిగాంచారు. ఉర్దూ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేరెళ్ల, ఆంగ్ల భాషపై అధికారం సాధించడం, అనర్గళంగా మాట్లాడటం అనితర సాధ్యమని చెప్పాలి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక కర్త షేక్స్‌పియర్ నాటకాల్లోని సన్నివేశాలను పాత్రోచితంగా అనుకరించి శ్రోతలను విశేషంగా ఆకట్టుకునేవారు. మెకనాస్‌గోల్డ్, టెన్ కమాండ్‌మెంట్స్, బెన్‌హర్ వంటి విశ్వవిఖ్యాత హాలీవుడ్ సినిమాల్లోని నటీనటుల కంఠస్వరాలనే కాక, నేపథ్య సంగీతాన్ని కూడా యథాతథంగా అనుకరించగలిగిన మేటి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మాత్రమేనన్నది అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచీ చిత్తూరు నాగయ్య సినిమాలు ఎక్కువగా చూడటం వలన, ఆ మహాకళాకారుని గొంతును అద్భుతంగా అనుకరించేవారు. తెలుగునేలపై నేరెళ్ల మిమిక్రీ గళాన్ని వినిపించని పట్టణం ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలోనేకాక, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లెక్కకు మించిన ప్రదర్శనలతో ఎందరో మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, కృష్ణమీనన్, హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ వంటి ప్రముఖులతో నేరెళ్లకు స్నేహ సంబంధాలుండేవి. కాకతీయ, ఆంధ్రా, తెలుగు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో నేరెళ్లను సత్కరించాయి. శాసన మండలి సభ్యునిగా, ఫిల్మ్‌బోర్డు, దూరదర్శన్ సలహా సంఘం, రైల్వే సలహా కమిటీ వంటి అనేక కమిటీల్లో సభ్యులుగా నేరెళ్ల సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, సుబ్బిరామిరెడ్డి కళాపీఠం నుంచి లైఫ్‌టైమ్ అవార్డును అందుకున్నారు. కళాకారుడు ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మెలగగలిగినప్పుడే మంచి పేరు సాధించగలడన్నది వేణుమాధవ్ విశ్వాసం. ఆయన దానిని మనసావాచా ఆచరించి చూపడమేకాక, వందల సంఖ్యలో ఉన్న తన శిష్యులకు ఆ నిత్యసత్యాన్ని బోధించే వారు. నేరెళ్లకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ‘ఏకలవ్య’ శిష్యులు ఉన్నారంటే మిమిక్రీ కళలో ఆయనకున్న ప్రతిష్ట ఎంతటిదో అర్థమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం వేణుమాధవ్‌ను ‘పద్మశ్రీ’ బిరుదుతో సగౌరవంగా సత్కరించింది. ఎనభయ్యవ పడిలో ప్రవేశిస్తున్న నేరెళ్ల వేణుమాధవ్ ప్రతి పుట్టిన రోజును ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’గా జరుపుకోవడం ఆయనకు దక్కిన అరుదైన పురస్కారంగా భావించాలి. జల్లారపు రమేష్ మిమిక్రీ క ళాకారుడు, హైదరాబాద్
(నేడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ 79వ జన్మదినం)
సాక్షి నుండి

Tuesday, December 27, 2011

ఆధునిక సాహిత్యంలో తెలంగాణా వచన కవులు

అందమైన వచన రచన చేయడం అంత సులువేమి కాదు. నుడికారపు నాడిని తెలుసుకొని, నిరంతర సాధన సాగిస్తేనే ముచ్చటైన వచన రచన చేసే వీలు కలుగుతుంది. మహాకవి తిక్కనకు తేట తెనుగు మాటల మూటల్ని అందించిన తెలంగాణ మాగాణం. ఆధునిక యుగంలోనూ అందమైన తెలుగు వచనానికి చిరునామాల్ని ఏర్పర్చింది. అందాలొలికే పసందైన వచనాన్ని రచించిన కొంత మంది ప్రతిభను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం.

గత కాలపు తెలుగు సాహిత్య చరివూతను ఒకసారి పరిశీలిస్తే వచన (గద్య) రచన తొలుత తెలంగాణలోనే ఆరంభమైంది. తొట్ట తొలి వచన రచయితగా పేర్కొనే కృష్ణమాచార్యులు మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారని సాహిత్య చరివూతకారులు గుర్తించారు. ఆయన రచించిన సింహగిరి రచనలు ప్రసిద్ధమైనవి. కవులందరూ అన్ని అంశాల్ని పద్యాల్లోనే పలుకుతున్న కాలంలో అందరి కంటే విభిన్నంగా రచనల్ని ఎన్నుకున్న నవ్యుడు కృష్ణమాచార్యులు. ఆనాడే ఆయన తెలుగు వచన రచనకు మార్గాన్ని నిర్మించారు.
16-17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా భావిస్తున్న కాసె సర్వపు ‘సిద్దేశ్వర చరివూత’లో కొంత వచనం కూడా ఉంది. సాధారణ నియమాల్ని లెక్కించకుండా సర్వస్వతంత్ర పద్ధతిలో సర్వప్ప వచనం సాగిందని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు నిర్ధారించారు. అయితే, 19వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి.

ఈ సమయంలో కోస్తాంధ్ర ప్రాంతంలో వచన రచన బాగా విస్తరించింది. కుంఫిణీ పరిపాలన కారణంగా ఏర్పడిన సాంస్కృతిక పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఆంగ్ల సాహిత్యం కోస్తాంవూధలో ఆ సమయంలో బాగా ప్రచారాన్ని పొందడంతో ఆంగ్లంలోని వచన రచన అక్కడి రచయితలపై బాగా ప్రభావాన్ని చూపించింది. ఎంతో మంది వచన రచయితలు వ్యాసాన్ని, జీవిత చరివూతల్ని రచించడం ఆరంభించారు. కందుకూరి వీరేశలింగం ‘గద్యతిక్కన’గా గుర్తింపును పొందితే ఆయన శిష్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన లేఖనతో అందంగా వచనాన్ని తీర్చిదిద్దారు.

20వ శతాబ్ది ఆరంభంలో పానుగంటి లక్ష్మీనరసింహరావు ‘సాక్షి’ వ్యాసాలు విస్తారంగా ప్రచారాన్ని పొందాయి. గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణ పరిసరాల్లో ఎందరో వచన రచయితలు చక్కని రచనలు చేశారు. వీరు కోస్తాంవూధలో యువతరాన్ని వచన రచనవైపు నడిపించారు. పత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ రచయితలకు చక్కటి పోత్సాహాన్ని కల్పించాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో కోస్తాంవూధకు భిన్నమైన సాంస్కృతిక వాతావరణం ఉండేది. అధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగుకు అధికారరీత్యా తగిన ఆదరణ లేకపోవడం, భూస్వామ్య సమాజం, ప్రజానీకంలో తక్కువ అక్ష్యరాస్యతల వల్ల వచన రచయితలకు తగిన ప్రొత్సాహం దొరకలేదు. ఈ సమయంలో తెలంగాణలో వచన రచనకు తొలి పునాదులు వేసిన పండితుడు-పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వరూపశిల్పి కొమపూరాజు లక్ష్మణరావు. ఆయన ఎంతో సాఫీగా సాగిపోయే వచనాల్ని రచించారు. కొమపూరాజు వారికి బాగా సన్నిహితంగా ఉన్న పండిత ఆదిరాజు వీరభవూదరావు వంటి పరిశోధకులు ఆయన నుండి ప్రేరణ పొందారు. ఇట్లా 1920 నాటికి తెలంగాణలో వచన రచన బలంగా అంకురించింది.

బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. వ్యావహారిక భాషోద్యమ ప్రభావం ఎంత మాత్రం లేని తెలంగాణలో వ్యావహారికానికి బాగా సన్నిహితంగా ఉండే భాషను వీరు ఎంపిక చేసుకోవడం చెప్పుకోదగిన గొప్ప విషయం! ఇదంతా 1922-24 నాటి మాట. రమారమి ఈ కాలంలోనే సురవరం ప్రతాపడ్డి తన రచనా ప్రస్థానాన్ని ఆరంభించారు. వివిధ పత్రికలకు అనేకాంశాలపై వ్యాసాలు రాస్తూ వచ్చారు. ‘గోలకొండ’ పత్రిక నిర్వాహక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతాపడ్డి నిరంతరం వచన రచన చేశారు. చెప్పవలసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శైలీ వైవిధ్యాన్ని పాటించారు. ఎంతో మంది వర్ధమాన వచన రచయితల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అత్యంత తీవ్రమైన, సాధారణ విషయాల్ని సైతం తేట తెనుగు సూటి వచనంగా ప్రతాపడ్డి చెప్పగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం. 1950ల నాటి తరం ఆయన మార్గంలో నడిచేందుకు ఆసక్తిని చూపించింది.

గడియారం రామకృష్ణ శర్మ, డి. రామలింగం, దాశరథి కృష్ణమాచార్యులు, బిరుదురాజు రామరాజు, జువ్వాడి గౌతమరావు-వీరంతా ఆ తరానికి చెందినవారే. వీరిలో పలువురిపై సురవరం ప్రభావం ఉంది. గడియారం వారు 1950ల నాటికే మంచి వచన రచయితగా గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో కొంత కాలంపాటు ‘సుజాత’ అనే సాహిత్య పత్రికను నిర్వహించారు. గడియారం సుందర వచనానికి ఆయన ఆత్మ కథ ‘శత పత్రం’ పతాకస్థాయికి ప్రతీక. విషయాన్ని సుభోధకంగా, ఆసక్తికరంగా సంయమన పద్ధతిలో తీర్చిదిద్దడం ఆయన తీరు. డి. రామలింగం సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, పుస్తక సమీక్షకులు. పదాల పొదుపులో రచనలు చేయడం రామలింగం ప్రత్యేకత. దాశరథి కృష్ణమాచార్యులు ఎంత చక్కటి కవిత్వాన్ని రచించారో అంతే అందమైన వచనాన్నీ తీర్చిదిద్దారు. ‘అగ్నిధార’ కావ్యానికి రచించిన ముందుమాట (పురాస్మృతులు) ఇందుకొక ఉదాహరణ. 1980లలో దాశరథి రచించిన ‘యావూతస్మృతి’కి నిలబడ్డ జ్ఞాపకాల పందిరి. పాఠకుల మనసుల్లో చిరస్మరణీయమైన స్మృతి దాశరథి రంగాచార్య వచన రచనలో నిర్మించుకున్న ప్రత్యేకమైన శైలి 1950వ దశాబ్దినాటి దేహదాసు-వూపాణదాసు ఉత్తరాల్లో ఆవిష్కృతమైంది. 1990ల చివరలో ఆయన రచించిన ‘జీవనయానం’ ఆత్మకథ ఆత్మీయమైన శైలికి అచ్చమైన ఉదాహరణ.

ఆచార్య బిరుదురాజు రామరాజు రమారమి ఆరు దశబ్దాల పాటు పరిశోధనాత్మక వ్యాసాల్ని రచించారు. సాధారణంగా పొడిపొడిగా ఉన్నట్టనిపించే పరిశోధనాంశాల్ని సైతం చక్కని వచనంలో వివరించే అతి కొద్దిమంది పండితుల్లో రామరాజు ఒకరు. జువ్వాడి గౌతమరావు విమర్శనా రంగంలో సూటిదనంతో కూడిన వచన రచన చేశారు. 1950ల చివరలో ‘జయంతి’ పత్రిక సంపాదకులుగా ఆయన రాసిన కొన్ని వ్యాసాలు ‘సాహిత్య ధార’ పేరుతో కొద్ది సంవత్సరాల క్రితం ప్రచురణ పొందాయి. ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.

తెలంగాణ వచనంలో ఎస్. సదాశివ ప్రత్యేక అధ్యాయాన్ని నిర్మించుకున్నారు. ఆయనకు ఉర్దూ తదితర భాషల్లో అఖండమైన పాండిత్యం ఉంది. సంగీతంలో విశేషమైన పరిజ్ఞానం ఉంది. సాహిత్య పరిణామాల్ని సహృదయతతో సమీక్షించే గొప్ప మనసు ఉంది. ఆయన రచనలు సంగీత-సాహిత్య-ఆత్మీయతల, అల్లిబిల్లిలతలు. నిజానికి సదాశివ వచనంపై ప్రత్యేకమైన పరిశోధనే జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆధునిక శైలీ సూత్రాలను ఆలంబనగా చేసుకుంటే సముచితమవుతుంది. సదాశివ వ్యాసాలు సాధారణ రచనలు కావు. వాటికి సరిహద్దులు ఉండవు. అవి జ్ఞాపకాల జలపాతాల నుండి సాగుతూ, మానవీయ శిఖరాల్ని అందుకుంటూ చల్లని గాలివలే సాగిపోతూ ఉంటాయి. ‘మలయ మారుతాలు’ చదివిన వారికి ఈ అనుభవం అవగతమవుతుంది. అచ్చ తెలుగులో రాస్తూ అక్కడ కూడా అన్యభాషా పదాల్ని పొదగడం సదాశివ వంటి ప్రతిభావంతులైన అక్షర శిల్పులకే సాధ్యమవుతుందనిపిస్తుంది. ఆయన ‘యాది’ తెలంగాణలో వెలువడిన అత్యుత్తమ వచన రచనల్లో ఒకటి.

సుప్రసిద్ధ డాక్టర్ సి.నారాయణడ్డి వచన రచనలు తక్కువగానే ఉన్నాయి. ఆయన గేయాల్లోని లాలిత్యం వచనంలోనూ ప్రతిధ్వనిస్తుంది. సినారె మరిన్ని వచన రచలు చేస్తే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తుంది. కాళోజీ కూడా వచనాన్ని రచించారు. కాళోజీ కవిత్వంలోని ప్రత్యేకతలు వచనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరహింహారావు గతంలో వరంగల్లు నుండి ‘కాకతీయ’ అనే పత్రికను నిర్వహించే వారు. ఆ రోజుల్లో ఆయన కలం పేర్లతో జాతీయ అంతర్జాతీయ అంశాలపై చక్కని వ్యాసాలు రచించే వారని ఆ తరం ప్రముఖులు చెబుతారు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమారలు ఇద్దరూ పలు వచన రచనలు చేశారు. వీరు సుప్రసిద్ధ విమర్శకులు. వీరిలో సుప్రసన్న నిరంతర కవిత్వారాధన చేస్తే సంపత్కుమార పరిశోధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ మంచి వచనాన్నే రచించారు. అయితే వీరిలో సుప్రసన్న వచనం తొలుత సంక్లిష్టంగా ఆరంభమై అంతకంతకూ సరళత్వాన్ని పొందింది. ‘ప్రాక్షిగూపాల’ వంటి అత్యంత క్లిష్టమైన అంశాన్ని గురించి కూడా ఆయన సరళ రీతిలో వ్యాసాల్ని రచించారు. సంపత్కుమార వచనం సరళంగా ఆరంభమై క్రమేపీ సంక్లిష్టంగా మారిందని గుర్తించవచ్చు. చాలారోజుల క్రితం సంపత్కుమార రచించిన ‘మన కవులు పండితులు-రచయితలు’ అనే తెలంగాణ సాహితీవేత్తల జీవన రేఖల్ని సుస్పష్టంగా పరిచయం చేసింది. ఈ మార్గంలో వెలువడిన మొట్టమొదటి ఆధునిక తెలంగాణ వచన రచన దాదాపు ఇదే.
‘పోతన చరిత్ర’ మహాకావ్య కర్త వానమామలై వరదాచార్యులు కొన్ని వచన రచనలు చేశారు. అవి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రచురణ పొందాయి. వరదాచార్యుల శైలి పానుగంటి వారి ‘సాక్షి’ మార్గంలోనే హరిహరపు వెంకట రామయ్య అనే ఆయన కొన్ని రచనలు చేసినట్లు చెబుతారు. ఇవికూడా ప్రచారానికి నోచుకోలేదు.

అడపాదడపా వచనాన్ని రచించిన ప్రతిభావంతులు అప్పటినుండీ నిన్న మొన్నటి వరకూ ఉన్నారు. ‘కాపుబిడ’్డ కావ్యకర్త గంగుల శాయిడ్డి చాలావరకు వచన రచనలు చేశారు. ఒకటి రెండు రచనలు పరిశీలిస్తే ఆయనది ఉద్విగ్నభరితమైన శైలి అని అర్థమవుతుంది. ముదిగొండ ఈశ్వరచరణ్, పాములపర్తి సదాశివరావు, జి.సురమౌళి ప్రఖ్యాతులు రచించిన వచనం చెప్పుకోదగింది.
తెలంగాణ నుడికారాన్ని , స్థానీయతను ఇటీవలి కాలంలో అక్షరీకరిస్తున్న మరో ప్రతిభావంతుల్ని ఇక్కడ తప్పకుండా పేర్కొనాలి. వారి ఒకరు కాలువ మల్లయ్య. కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల స్థానీయమైన పలుకుబడి ఆయన వచనంలో సుస్పష్టంగా కనబడుతుంది. బాల్యస్మృతులు ఎంత మధురంగా ఉంటాయో ఆ వచనంలోని భాషా సహజత్వం అంత తీయగా ఉంటుంది. మరో రచయిత నాగిళ్ళ రామశాస్త్రి. కాళోజీకి అత్యంత సన్నిహితులు. నాగిళ్ళ ఎక్కువగా రాయలేదు. ఆయన ఒక సహృదయ సాహిత్యాధ్యయన శీలిగా గుర్తింపు పొందారు. కొన్ని సంవత్సరాల క్రింత ‘కాళోజీ ముచ్చట్లు’తో తన వచన రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేశారు.

ఆ పుస్తకం చదివితే మన మధ్య లేని కాళన్నతో గంటల తరబడి మాట్లాడినట్టే ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది. ఉర్దు పదాలు వాడినట్లు తెలియకుండానే వాడుతూ పోవడం నాగిళ్ళ ఆవిష్కరించిన ‘మణి ప్రవాళ శైలి’ పుస్తక సమీక్షల్లో ఎటువంటి శైలిని అవలంబించాలన్నది రామా చంద్రమౌళి రచనలు చదివితే చక్కగా అర్థమవుతుంది. ఆయా పుస్తక రచయితల అభివ్యక్తీకరణకు ఎంతో దగ్గరగా ఉండే పదాల్ని ఆయన ఎంపిక చేసుకునే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తక సమీక్షలు రాయడం అనుకున్నంత సులువు కాదని నిరూపించిన వారిలో చంద్రమౌళి ఒకరు. సంక్షిప్తత, సూటిదనం ఆయన సమీక్షల గొప్ప లక్షణాలు.
తెలంగాణలో జన్మించకున్నా ఇక్కడి భాషను, జనజీవితాన్ని అభిమానించిన దివంగత పాత్రికేయులు జి.కృష్ణ ప్రముఖ పరిశోధకులు ఖండవల్లి లక్ష్మీరంజనం, విమర్శకులు అవధాని దూపాటి వెంకటరమణాచార్యులు మంచి వచనాన్ని నిర్మించారు.

జి.కృష్ణ రచనల్లోని ‘జ్ఞాపకాల సుగంధాలు’ ఆనాటి సమాజంలోకి తీసుకొనిపోతాయి. నిరలంకారంగా కన్పించే అలంకారిక వచనాల్ని రచించడంలో ఖండవల్లి సిద్ధహస్తులు. పరిశోధనా వ్యాసాల రచనలో దూపాటి వారిది ఒక ప్రత్యేకమైన పద్ధతి.
ఇలాంటి వారే కాక తెలంగాణ మాగాణంలో సాహిత్య అందమైన రచనలు చేస్తున్న వారు మరిందరు లేకపోలేదు. వారిలో కొందరు:
కాళోజీ సురవరం ప్రతాపడ్డి
ముదిగొండ ఈశ్వర చరణ్ డి. రామలింగం
పాములపర్తి సదాశివరావు బిరుదురాజు రామరాజు
జువ్వాడి గౌతమరావు దాశరథి కృష్ణమాచార్యులు
ఒద్దిరాజు సోదరులు కొమపూరాజు లక్ష్మణరావు
ఎస్8. సదాశివ కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమార
వానమామలై వరదాచార్యులు హరిహరపు వెంకట రామయ్య
నాగిళ్ళ రామశాస్త్రి గడియారం రామకృష్ణ శర్మ
ఖండవల్లి లక్ష్మీరంజనం రామా చంద్రమౌళి
జి. సురవకాళి ఆదిరాజు వీరభవూదరావు


( ఈ వ్యాస రచయిత : డా॥ జి. బాల శ్రీనివాస మూర్తి
తెలంగాణా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, మొబైల్: 98669 17227)
(ఈ వ్యాసం నమస్తే తెలంగాణా లో ప్రచురితమైంది )

Friday, December 16, 2011

" దళిత ఆత్మగౌరవ పతాక! బోయి భీమన్న "

సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ శక్తివంతమైన రచనలు చేసి అర్ధశతాబ్దం పైగా ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప రచయిత, కవి, నాటకకర్త, దార్శనికుడు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19న పుట్టిన భీమన్న కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు. దళితుల అభ్యున్నతికి రచనలు చేసిన తొలి తరం దళిత రచయితల్లో అగ్రగామి. పాలేరు నుంచి పద్మభూషణుడి దాకా ఎదిగి వచ్చిన వాడు. చిన్ననాట తల్లి పాడే జానపద గీతాలు, తండ్రి ఆలపించే తాత్వాలు భీమన్నలోని సృజనకారుని జాగృతం చేస్తే, తను పుట్టి పెరిగిన కులం కుదురు దళిత సమస్యల మీద పాలేరు, జన్మాంతర వైరం, రాగవాశిష్టం, గుడిసెలు కాలిపోతున్నాయ్, పంచమస్వరం వంటి రచనలు చేయించింది. తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా, ఆ తరువాతి కాలంలో జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పనిచేసిన భీమన్న తొలి తరం దళిత పాత్రికేయులు. ‘జానపదుని జాబులు’ అచ్చయిన తొలి గ్రంథం. అప్పటికే పాలేరు నాటకం ఆంధ్రదేశమంతటా మారుమోగుతోంది. దళితుల అభ్యున్నతికి ప్రధాన అవరోధం అవిద్య అని గ్రహించిన భీమన్న పాలేరు నాటకంలో దళిత యువకుడు డిప్యూటీ కలెక్టరైన పరిణామాన్ని దృశ్యీకరించాడు. పాలేరు నాటకం చూసి ప్రభావితులైన నాటి దళిత యువతరం, పాలేరుతనం మానేసి ఉన్నతాధికారులు కావడం చరిత్ర. కూలిరాజు నాటకం ద్వారా శ్రామిక రాజ్యాన్ని ఆకాంక్షించాడు. హరిజనులు ఆర్యులే అని నిరూపించడానికి రాగవాశిష్టం, వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటి రచనలు చేశాడు. తను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బలపరుస్తూ, తన గ్రంథాలకు విలువైన విపుల పీఠికలు రాశారు. అంబేద్కర్‌ను ఆంధ్రదేశ పర్యటనలో దగ్గరగా చూసిన భీమన్న, ఆయన భావాలతో, రచనలతో ప్రభావితమయ్యాడు.

అంబేద్కర్ రచించిన ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. దళిత విముక్తి కోసం మేనిఫెస్టో అనదగిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథాన్ని రచించాడు. ఉద్యమ రచనలతో పాటు సౌందర్య తత్వం నిండిన ‘రాగవైశాఖి’ వంటి శృంగార లేఖా సాహిత్యాన్ని సృష్టించాడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి గల భీమన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. 1978-84 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండ లి సభ్యులుగా వ్యవహరించారు. ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్‌గా సేవలందించారు. ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన బోయి భీమన్న దళిత ఆత్మగౌరవ పతాకగా నిలిచిపోయారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహారచయిత బోయి భీమన్న నేటి యువ రచయితలకు స్ఫూర్తి కావాలి!
-డాక్టర్ శిఖామణి హైదరాబాద్
(నేడు బోయి భీమన్న ఆరవ వర్ధంతి)