జాతీయములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు



  ఈ వ్యాసం విభజన జరుగుతూ ఉన్నది. 


బక్క జనం

పేద ప్రజలు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. బక్కగా ఉండడమంటే బలహీనంగా ఉండడమని అర్థం. పేదరికం కారణంగా శారీరకంగా, మానసికంగానే కాక సామాజికంగా కూడా ప్రజలు బలహీనులుగా ఉంటారు. అలాంటి పేద ప్రజలను ఈ జాతీయంతో సూచిస్తుంటారు. 'నోట్లు ఆశ చూపితే బక్క జనం ఓటేస్తారని ఆయన అనుకుంటున్నాడు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

సిగపట్లు

అభిప్రాయ భేదాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. శిఖ అనే శబ్దం నుంచి సిగ వచ్చింది. సిగ అంటే జుట్టు, తల అనే అర్థాలు ఉన్నాయి. సిగ తరగ, సిగలోకి విరులిచ్చి... అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం ఉంది. ఈ జాతీయం విషయానికి వస్తే జుట్టు జుట్టు పట్టుకొని తన్నుకొనేదాక వచ్చిందనేది అంతరార్థం. వాస్తవానికి అలా తన్నుకొన్నా తన్నుకోకపోయినా అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దీన్ని ప్రయోగిస్తుంటారు. "ఆ విషయం దగ్గరే ఇద్దరికీ సిగపట్లదాకా వచ్చింది" అనేలాంటి సందర్భాలు కనిపిస్తున్నాయి.

గుండె కరగటం

జాలి, కరుణ, సానుభూతి లాంటి భావాలు కలగటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనసుకు పర్యాయపదంగా గుండెను వాడుతుండటం వల్ల ఈ జాతీయం అవతరించింది. " సాయం చేయమనిఎంతగా వేడుకొన్నా... ఆయన గుండె కరగలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కలుపుగోలు కల్లు

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న ఈ జాతీయానికి ఇరువర్గాలవారు విభేదాలను మరిచి స్నేహంగా కలిసిన సందర్భంలో ఇచ్చే విందు అని, వివాహ సంబంధాల నిశ్చయ సమయంలో ఇచ్చే విందు అని అర్థాలున్నాయి. పూర్వపురోజుల్లో అలా ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు విందు ఇచ్చి కల్లు తాగించే ఆచారం కూడా ఉండేది. తర్వాత కాలంలో కల్లు ప్రస్తావన ఉన్నా లేకపోయినా విందు ఇచ్చే సందర్భాన్ని తెలపడానికి ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'నిన్ననే సంబంధం కుదిరింది. ఇవ్వాళ కలుపుగోలు కల్లుకు పోతున్నాం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

వేయికళ్లతో

అతిజాగ్రత్తగా పరిశీలించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా రెండుకళ్లతో సునిశితంగా పరిశీలిస్తేనే చాలా విషయాలు ఇట్టే తెలిసిపోతుంటాయి. అలాంటిది వేయికళ్లతో పరిశీలిస్తే ఏ విషయంలోని సారమైనా ఇట్టే అవగతమవుతుంది. ఈ జాతీయం రక్షణ వ్యవహారాలలో ఎక్కువగా ప్రయోగించడం కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ అత్యంత జాగరూకతతో రక్షిస్తున్నారని చెప్పేటప్పుడు 'దీన్ని ఇప్పటిదాకా వేయికళ్లతో కాపాడుతూ వచ్చాం. ఇకమీదట మీ ఇష్టం' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

రామరావణ యుద్ధం

పెద్దగొడవ అని, సుదీర్ఘకాలంపాటు జరిగే పోట్లాటలనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శ్రీరాముడికి రావణుడికి జరిగిన పరమభీకరమైన యుద్ధాన్ని తలచుకుంటూ అంత తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోందని తెలియజెప్పడమే ఈ జాతీయం లక్ష్యం. పౌరాణికాంశాలు, ఇతిహాసాల కథల నేపథ్యంలో ఇలాంటి జాతీయాలు వాడుకలోకి వచ్చాయి. 'నిన్న జరిగింది అంత సామాన్యమైన గొడవేమీకాదు. రామరావణ యుద్ధమే అనుకోండి' అనేలాంటి ప్రయోగాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.

తేగల పాతర

ఒకేచోట సులభంగా కావల్సినవన్నీ దొరకడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తాటిపళ్ళను ఒకచోట గుంట తవ్వి వందల సంఖ్యలో పాతరగా వేస్తారు. ఆ తర్వాత కాలక్రమంలో అవన్నీ తేగలుగా మారుతాయి. ఒక్కపాతర తవ్వితే వందలకొద్దీ తేగలు ఎంతో సులభంగా ఒకేచోట లభిస్తాయి. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'ఆ ఊరు ఊరంతా ఓ రాజకీయ పక్షంవారివైపే. అందుకే తేగల పాతరలాంటి ఆ ఊరును ఆ నాయకులంతా అంటిపెట్టుకుని కూర్చున్నారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

రామగోస

మంచికిపోతే చెడు ఎదురైందన్న భావన ఆధారంగా అవతరించిన ఈ జాతీయం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. గోస అంటే కష్టం అని అర్థం. శ్రీరామచంద్రుడు చాలా మంచివాడే. ఆయన తన తండ్రిమాట వినాలనుకుని మంచికిపోయి వనవాసం, భార్యావిరహం లాంటి కష్టాలను పొందాడు. ఇదంతా మంచికోసం పోయినందువల్లనే జరిగింది. ఇలాగే ఎవరైనా మంచి పనికోసం వెళ్లినప్పుడు చెడు ఎదురైతే ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడు కష్టాలలో ఉన్నాడు కదా అని ఆదుకొనేదానికి వెళ్లొచ్చిన్నందుకు రాంగా పోంగా రామగోస అయింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

నోరుచేసుకోవటం

దూషించటం, కోపంగా మాట్లాడటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. "అనవసరంగా నోరుచేసుకోకు ఇబ్బందుల పాలవతావు" అనేలాంటి సందర్భాల్లో దీని వాడుక కనిపిస్తుంది. అంతేకానీ నోటిని దేనితోనో తయారు చేయటమనేది ఇక్కడి అర్థంకాదు. మాట అనే పదానికి నోరు అనే పదం పర్యాయపదంగా కనిపిస్తుంది.

వేదవాక్కు

తప్పనిసరిగా ఆచరించి తీరాల్సింది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనకు వేదాలు ప్రమాణాలు. అలాంటి వేదాలు చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాల్సిందే అనే భావనతో ఈ జాతీయం అవతరించింది. అయితే ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తి అదుపాజ్ఞలలో ఉన్నాడు, అతడు చెప్పిందల్లా చేస్తాడు అనే సందర్భాల్లో ఎక్కువగా ప్రయోగంలో కనిపిస్తోంది. 'అతడి మాటంటే ఇతడికి వేదవాక్కు' అనేలాంటి ప్రయోగాలు తరచుగా వినిపిస్తుంటాయి..

గోడకుర్చీ

తెలియనివారు ఇదేదో టేకుతో చేసిన కుర్చీలాంటిదేమోనని భ్రమ పడేలా ఉంటుంది ఈ జాతీయం. పూర్వకాలం పాఠశాలల్లో తప్పుచేసిన పిల్లలను గోడకుర్చీ వేయించి శిక్షించేవారు. గోడకు ఒరిగి ఉండేలా కుర్చీపై కూర్చున్నట్లుగా కూర్చోపెడతారు. ఇలా కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శారీరకంగా బాధ కలుగుతుంది. ఇది ఓ శిక్ష లాంటిది. 'అరిచావంటే గోడకూర్చీ వేయిస్తాను జాగ్రత్త' అని అనడం తరచుగా మనకు వినిపించే మాటే.

రాక్షసుడు

దుర్మార్గుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సర్వసాధారణంగా రాక్షసులు ఎప్పుడూ మంచివారిని వేధిస్తుంటారు. చివరకు దేవతలను కూడా విడిచిపెట్టరు. అలాంటి తత్వంతో ఎవరైనా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయంతో పోల్చిచెబుతుంటారు. 'వాడొట్టి రాక్షసుడని దగ్గరికెళ్లాకగానీ తెలిసిరాలేదు సుమా!' అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తుంటాయి.

యమ సంకటం

భరించరాని కష్టం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చెప్పుకోలేని బాధ అనే అర్థంలో కూడా ఇది వినిపిస్తుంది. విపరీతమైన వ్యథను సూచించే సమయంలో 'ఈ పరిస్థితి అతడికి యమ సంకటంగా పరిణమించక తప్పదు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

కడుపు కుటకుట

ఈర్ష్య, ఓర్వలేనితనం అనే అర్థాలలో వినిపించే ఈ జాతీయం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉంది. ఎదుటివాడు అభివృద్ధిలోకి వస్తున్నాడని ఓర్వలేనితనంతో ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు 'వాడిని చూసి వీడి కడుపు కుటుకుటలాడుతాంది" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

గాలిలోకి ఎత్తివేయటం

అతిగా పొగడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎవరైనా పొగిడినప్పుడు మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరై గాలిలో తేలినంత ఆనందానుభూతి కలుగుతుంటుంది. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. "మాయమాటలు చెప్పి వాడిని గాలిలోకి ఎత్తేశారు, ఇప్పుడు వాడు గర్వంతో ప్రవర్తిస్తున్నాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

భుజాలమీద చేతులు వేయటం

చనువుతో ప్రవర్తించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. బాగా స్నేహంగా ఉండేవారు ప్రవర్తించే తీరును దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. నిజంగా భుజాలమీద చేతులు వేసుకొని తిరిగినా, తిరగకపోయినా ఇద్దరు వ్యక్తులు బాగా స్నేహంగా ఉన్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. 'నిన్నటిదాక ఆ ఇద్దరూ భుజాలమీద చేతులు వేసుకొని తిరిగారు. ఇంతలో ఏమైందో ఏమో విడిపోయారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని గమనించవచ్చు.

పుండుమీద కారం చల్లడం

కష్టాలలో ఉన్నవారిని మరింత కష్టాలపాలు చేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పుండు ఉన్న వ్యక్తి బాధ వర్ణనాతీతమే. దానిమీద మందు రాయడమో లేదా మరింకేదైనా ఉపశమనచర్య చేయడమో చేస్తే హాయిగా ఉంటుంది. అలా కాక కారం చల్లితే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఇదే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. 'వరదల్లో ఇల్లు, వాకిలి మునిగి బాధపడుతుంటే దగ్గరున్న కొద్ది డబ్బు కూడా ఎవరో కాజేసేసరికి పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఊపునివ్వడం

ప్రోత్సాహమివ్వడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. స్తబ్ధంగా ఉన్నప్పుడు ఒకచోట పడిఉండడం తప్ప మరేవిధమైన పని జరగడానికి వీలుండదు. అదే కదలికలో ఉన్నప్పుడు, అది కూడా మంచి వూపుతో ఉన్నప్పుడు కార్యసాధనకు వీలు కలుగుతుంది. ఈ చలనాత్మక దశలో ఉన్న శక్తిని సూచించే విధంగా వూపునివ్వడం అనేది కార్యసాధనకు ఉద్యమించేలా చేయడం, కదలికను తెప్పించడం, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేలాంటి అర్థాలలో ప్రయోగంలోకి వచ్చింది. 'ఆ నాయకుడి ప్రసంగం అందరికీ మంచి ఊపునిచ్చింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

సింహనాదం చేయడం

తీవ్రంగా విమర్శించడం, తిరుగుబాటు చేయడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా అయితే సింహ శబ్దానికి అధికం, ఉన్నతం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. నాదం (శబ్దం) సాధారణ స్థాయి కన్నా మరింత ఎక్కువగా చేస్తూ తిరుగుబాటుదారులే తమ నిరసనను వ్యక్తం చేస్తూ శబ్దం, అలజడి సృష్టిస్తుంటారు. ఈ భావన ఆధారంగా ఇది జాతీయమైంది. 'పాలకపక్షం తీరుపై ప్రతిపక్షం నిన్న సింహనాదం చేసింది' అనేలాంటి ప్రయోగాలు తరచుగా వినిపిస్తుంటాయి.

నువ్వులు, బెల్లం తిను

ఇది తెలంగాణా ప్రాంత పండుగల సంప్రదాయంలో ఆవిర్భవించిన జాతీయం. సంక్రాంతి పండుగనాడు నువ్వులు, బెల్లం కలిపి ఇల్లిల్లూ తిరిగి అందరికీ పెడుతూ 'నువ్వులు, బెల్లం తిను, నూరేళ్లూ బతుకు, తియ్యగా తిని తియ్యగ మాట్లాడు' అని చెప్పి వెళుతుంటారు. ఇది సామాజిక సంక్షేమాన్ని కాంక్షించే ఓ ఆచారం కూడా. పొరపొచ్చాలు, విభేదాలు అన్నీ మరిచిపోయి హాయిగా అందరం కాలం గడుపుదాం అని ఊరూరు అనుకొనేందుకు వీలుగా ఈ ఆచారం ఏర్పాటైంది. అయితే ఇది జాతీయంగా వచ్చినప్పుడు 'నువ్వులు బెల్లం తిన్నడు, వాళ్లతో కలిసి పోయిండు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

పంచబంగారం

తెలుగునాట కొన్ని శతాబ్దాల కిందటి నుంచి వాడుకలో ఉన్న జాతీయమిది. ఏమీలేదు అంతా హుళక్కే అనేలాంటి అర్థాలలో ఇది ప్రయోగంలో ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలలోను, ఆనాటి సమకాలీనుల సాహిత్యాలలో కూడా ఈ జాతీయం కనిపిస్తుంది. 'అది పంచబంగారం, దాన్ని నమ్మితే ఎలా?' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

షాక్‌ తినడం

దిగ్భ్రమ చెందడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అన్యభాషా పదాలు మన భాషా పదాలకు జత కూడి జాతీయాలయ్యాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. 'ఆ వార్త వినగానే అతడు షాక్‌ తిన్నాడు' అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తాయి.

గడ్డిపోచ

అత్యల్పం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. గడ్డిపోచను ఎవరూ అంతగా లెక్కచేయరు. అంత అల్పమైన విషయాన్ని దేన్నైనా ప్రస్తావించదలచుకుంటే 'అదేమంత గొప్పదేంకాదులే, గడ్డిపోచతో సమానం' అనో, 'గడ్డిపోచలాంటివాడు వాడిని లెక్కచేసేదేంటి' అనో ప్రయోగించడం కనిపిస్తుంది. సంస్కృత భాషాపరంగా కూడా తృణప్రాయం అనేది వాడుకలో ఉంది.

వెన్నెముక

ప్రధానమైనది, ఆధారమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మానవదేహంలో వెన్నెముకకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'దేశానికి రైతు వెన్నెముకలాంటివాడు' అనే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

తుర్రుమనడం

వెంటనే వెళ్లిపోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వేగంగా క్షణాల్లో ఒకచోటనుంచి వెళ్లిపోవడం అనేది పక్షుల కదలికలకు సంబంధించిన విషయం. అవి ఉన్నట్టుండి ఒకచోట నుంచి ఒక్కసారిగా ఎగిరిపోతాయి. ఈ ఎగిరే విధానానికి తుర్రుమని ఎగరడం అనేది అనుకరణ శబ్దంగా ప్రయోగంలో ఉంది. ఇలా ఇదొక జాతీయంగా ప్రచారంలోకి వచ్చింది. 'ఆ పిల్ల సిగ్గుతో తుర్రుమనిపోయింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం గమనించవచ్చు.

ఖయ్యిమనడం

కోపంతో అరవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరైనా ఎదుటి వ్యక్తి మీద విపరీతంగా కోపం ప్రదర్శిస్తూ అరుస్తున్న సమయంలో ఖయ్యిమంటున్నాడు, ఖయ్‌ఖయ్‌ లాడుతున్నాడు అని అనడం కనిపిస్తుంది. ఇలా ఈ జాతీయం కోప భావ ప్రకటనకు ప్రతిబింబంగా ప్రయోగంలో ఉంది.

అందిపుచ్చుకోవడం

అలవరచుకోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒకరి నుంచి మరొకరు ఏదైనా అలవాటు చేసుకుంటున్న సందర్భంలో లేదా నేర్చుకుంటున్న సందర్భంలో కూడా అప్పుడప్పుడు ఈ జాతీయం ప్రయోగించడం కనిపిస్తుంది. 'ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో పాలకపక్షం సంస్కృతినే అందిపుచ్చుకుంటున్నాయి' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మోచేతి నీళ్ళు తాగటం

ఇంకొకరిమీద ఆధారపడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒకరు నీరు తాగుతుంటే వారి మోచేతి వెంబడి కారే నీళ్ళను తాగటమనేది ఆ నీరు తాగే వ్యక్తిమీద ఆధారపడి ఉండే విషయం. పైగా అసహ్యకరమైన పనికూడా. అలాంటి పరిస్థితులను వివరించేటప్పుడు "ఇంకొకడి మోచేతికింద నీళ్ళు తాగటం అనేది మానుకో. నీకుగా నువ్వు బతకటం నేర్చుకో" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

దేవుడిని ఎత్తుకురావడం

దబాయించడం, అతిగా బొంకడం, అడ్డూ అదుపూ లేకుండా మోసం చేసి తాను మోసగాడిని కాదని నమ్మబలకడం లాంటి అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వకాలం గ్రామాలలో దోషిని నిర్ణయించేటప్పుడు దేవుడి మీద ప్రమాణం చేయించేవారు. అబద్ధపు ప్రమాణాలు చేస్తే దేవుడు శిక్షిస్తాడని కొందరు నిజాలను ఒప్పుకునేవారు. కానీ మరికొందరు తప్పు చేసినా చేయలేదని దబాయించి గుళ్లో దేవుడి మీద ప్రమాణం చేయడమే కాక ఆ దేవుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకొచ్చి తాము తప్పు చేయలేదని నమ్మపలుకుతుండేవారు. ఆనాడు పుట్టిన ఈ జాతీయం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. తప్పు చేశాడని ఊరివారందరికీ తెలుసు. అయినా ఆ దోషి మరింత తెగించి దేవుడి విగ్రహాన్నే తెచ్చి తాను దోషిని కానని అనడం అందరికీ వింతగానే ఉండేది. నేడు కూడా అలా దేవుడిని ఎత్తుకొచ్చినా, ఎత్తుకు రాకపోయినా, నిజం చెప్పమని అడుగుతున్నప్పుడు తప్పు చేసినప్పటికీ చేయలేదని తనను తాను సమర్ధించుకునే వాడిని సూచించడానికి ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'వాడికేంటి. చేసేవన్నీ చేస్తాడు. దేవుడిని ఎత్తుకు రమ్మన్నా ఎత్తుకొస్తాడు. వాడిని నమ్మడమెలా' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

వెర్రితీగ తొక్కినట్టు

తెలంగాణా ప్రాంతంలో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. వెర్రితీగ ఓ రకమైన మానసిక చంచలత్వాన్ని కలిగించే తీగగా చెబుతారు. ఆ తీగను తొక్కిన వ్యక్తికి మతిమరుపు సంభవిస్తుంది. తానెవరో ఏమిటో మరిచిపోయి ప్రవర్తిస్తుంటాడని అంటుంటారు. నిజానికి అలాంటి తీగను తొక్కినా, తొక్కకపోయినా అప్పటిదాకా మామూలుగా ప్రవర్తించిన వ్యక్తి మరో విధంగా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇందాకటి దాకా బాగానే ఉన్నాడు. వెర్రితీగ తొక్కిండో ఏమో మన మాటే వినడంలేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ తీగను మరులుతీగ అని వ్యవహరించడం కూడా ఉంది.

రాచమర్యాదలు

ఎక్కువగా గౌరవ, ఆదరాలను చూపిస్తున్న సమయంలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న రోజుల్లో రాజుగారికి జరిగినంత గొప్పగా ఎక్కడైనా ఎవరికైనా మర్యాదలు జరుగుతున్నాయని భావించిన సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. అచ్చంగా రాజుకు జరిగినట్టుగా కాకున్నా అందరిలా కాక మరికొంత ఎక్కువ మర్యాదలను ఎవరైనా అందుకుంటున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. 'ఆయనకు రాచమర్యాదలు చేసి మరీ గౌరవించారు. అందుకే వారంటే ఆయనకు అంత ఇష్టం' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

మూటకట్టుకోవడం

సంపాదించుకోవడం, సమకూర్చుకోవడం అనే సాధారణార్థాలు ఈ జాతీయానికి ఉన్నాయి. పాపపుణ్యాల కర్మఫల ప్రస్తావన విషయంలో కూడా తాత్త్వికంగా ఈ జాతీయం వాడుకలో ఉంది. పుణ్యాన్ని మూటకట్టుకోవడం, పాపాన్ని మూటకట్టుకోవడం అనేలాంటి ప్రయోగాలు కూడా కనిపిస్తుంటాయి.

బొట్టూ కాటుక పెట్టి పిలవడం

తెలుగునాట ఉన్న ఆచార వ్యవహారాలు కొన్ని జాతీయాలుగా అవతరించాయనడానికి ఇదో ఉదాహరణ. ప్రత్యేకంగా పిలవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఇళ్లలో శుభకార్యాలు తలపెట్టినప్పుడు తమకు కావలసిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు బొట్టుపెట్టి పిలవడం, కొన్ని కొన్ని సందర్భాలలో అయితే కాటుక కూడా పెట్టి గౌరవంగా ఆహ్వానించడం అనేవి పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు. పెళ్లిళ్లలో పూర్వం ఆడపిల్ల తల్లి మగ పిల్లవాడి తల్లికి స్వయంగా అలంకారాలు చేయడం, ముఖాన మొహిరీలు అద్దడం లాంటివి కూడా ఉండేవి. ఇలాంటి ఆచారాల నేపథ్యం నుంచి ఈ జాతీయం పుట్టుకొచ్చింది. 'అందరితో పాటే ఆయన. అంతేకానీ ఆయన్నేమీ బొట్టూ కాటుక పెట్టి పిలవాల్సిన పని లేదు.' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు

అసంభవమైన కార్యాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయం వాడుకలో ఉంది. జల్లెడకు అంతా చిల్లులే ఉంటాయి. ఆ చిల్లుల జల్లెడతో నీరు తేవడమంటే అది అయ్యే పని కాదు. అలాగే కాని పనిని గురించి ఎవరైనా చెబుతున్నప్పుడు 'వాడు చెబుతున్న మాటల తీరు చూస్తే జల్లెడతో నీళ్లు తెచ్చినట్లుగా ఉంది తప్ప మరోలాలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడం గమనార్హం.

చేయి చేసుకోవడం

ఎదుటివ్యక్తిపై ఆగ్రహంతో చేయి చేసుకోవటం అనే సందర్భం ఈ జాతీయం వెనుక ఉన్న భావన. చెయ్యందించటం అనే జాతీయానికి సహాయం చేయటం అనే అర్థం ఎలా ఉందో దానికి వ్యతిరేకంగా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "అనవసరంగా ముందు అతడే చేయి చేసుకొన్నాడు. లేకపోతే ఇంతదాకా వచ్చేదికాదు." అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వినిపిస్తుంది.

నోరు మూసుకోమనడం

మాట్లాడొద్దని హెచ్చరించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. నోటిని రెండుచేతులతో మూసుకున్నా, మూసుకోకపోయినా మాట్లాడకుండా ఉండాలనడమే దీనిలోని ప్రధానార్థం. 'చర్చలు జరిగేటప్పుడు అతడిని నోరుమూసుకుని ఉండమనండి' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

ఇంటిదీపం

ఇల్లాలు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరి ఇంటికైనా దీపకాంతుల కళకళలలాంటి ఆనందాల రవళులను సంతరించిపెట్టగలిగేది ఇల్లాలే. గృహస్థాశ్రమ ధర్మవిశిష్ఠతను చాటిచెప్పడం కూడా ఈ జాతీయం వెనుక దాగివున్న భావనగా కనిపిస్తుంది. దాంపత్యంలో ఇల్లాలి పాత్ర గొప్పదనాన్ని వెలువరిస్తుందీ జాతీయం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు లాంటి ప్రయోగాలు చేయడం కనిపిస్తుంది.

ముల్లెగందులతనం

తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో ఈ జాతీయం వినిపిస్తుంది. ధనాన్ని కూడబెట్టడం అనేది దీనికి అర్థం. అయితే ఈ కూడబెట్టడం మరీ పిసినారితనంగా ప్రవర్తిస్తూ, తిండి కూడా సరిగా తినకుండా కూడబెడుతూ ఉంటే దాన్ని ముల్లెగందులతనం అని అంటారు. 'మరీ అంత ముల్లెగందులతనం పనికిరాదు. రేపు చచ్చినంక ఆ డబ్బంతా ఏంచేసుకొంటవ్‌' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

చురుకు ముట్టడం

కష్టాలు ప్రాప్తించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. బెత్తం లాంటి వాటితో ఎవరినైనా కొడితే చురుకు తగిలి బాధ కలుగుతుంది. ఆ బాధ అనుభవించే వాడికి వర్ణనాతీతంగానే ఉంటుంది. వాస్తవానికి బెత్తంతో కొట్టినా కొట్టక పోయినా గతం తాలూకు కష్టాలు ఏమైనా గుర్తుకొచ్చి ఆ కష్టాలు గుణ పాఠాలుగా ఉన్న సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'దొర దగ్గర ఇంతకు ముందే వాడికి చురుకు ముట్టింది. అందుకే మళ్లీ ఆయన ముందుకు వచ్చి పొగరుగా మాట్లాడడం లేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

రాగాలు పెట్టడం

ఏడవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కొంతమంది ఏడ్చేటప్పుడు వారి బాధను వెళ్లగక్కుతూ మధ్యమధ్యలో రాగయుక్తంగా ఏడవడం కూడా జరుగుతుంటుంది. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. అంతేకానీ నిజానికి సంగీతంలో ఉండే రాగాలనన్నింటినీ ఆలపించడమనో, పాడడమనో అర్థంలోమాత్రం ఇది వాడుకలో లేదు. 'సినిమాకు మాతో రావద్దనేసరికి వాడు రాగాలు పెట్టడం ప్రారంభించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

కోరల్లేని పాము

అధికారాలు ఏమీ లేనివాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాముకు కోరలు ఉంటే అది కాటువేస్తుందని, ఆ విషం ప్రాణాంతకమవుతుందని భావించి భయపడతారు. అదే ఆ పాముకు కోరలు లేవని అనుకొన్నప్పుడు ఆ పామును చూసి భయపడటంకానీ మరేదీ జరగదు. ఇక్కడ కోరలనేవి అధికారికి ఉండే అధికారాలుగా పోల్చిచెప్పటం జరిగింది. ఎవరినైనా శిక్షించటానికి తగిన అధికారాలు చేతిలోవున్న వాడిని చూస్తే కోరలున్న పామును చూసినట్లు అతడి కింది ఉద్యోగులు భయపడతారు. అధికారాలు లేనివాడిని చూస్తే అలాంటి భయమేదీ ఉండదు. "ఆయన కోరల్లేని పాములే... అందుకే నేనంతగా భయపడటంలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

గాడిదగుడ్డు

ఏమీలేదు... అని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. గాడిద గుడ్డుపెట్టదు. దానికి పిల్లలే పుడతాయి. అందుకని అదేమీలేదు, శూన్యం అని చెప్పడానికి కుందేటికొమ్ము తరహాలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. ప్రత్యేకంగా విసుగొచ్చినప్పుడు, నిందించాల్సి వచ్చినప్పుడు 'ఏముందని వెంబడిపడుతున్నావు. గాడిదగుడ్డుంది చూద్దువుగానీ... రా' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

ఇల్లు-ఇరవాటు

ఇది తెలంగాణ ప్రాంతంలో వినిపించే జాతీయం. తెలుగుభాషలో పురుగుపుట్ర లాంటి జాతీయాలు ఉన్నట్లుగానే ఇదికూడా ఉంది. ఇంటిలోకి కావలసిన అంటే గృహసంబంధమైనవన్నీ అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'ఆయనకేం ఇల్లూ ఇరవాటు అంతా మంచిగానే ఉన్నాయి" అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

ఇంటిదొంగ

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఓ సామెత. అలాగే ఇంటిదొంగ కన్నుండగానే... గుడ్డుమాయం చేస్తాడని కూడా అంటారు. అంటే అన్ని విషయాలు బాగా తెల్సిన సొంతవ్యక్తే నమ్మకద్రోహాన్ని తలపెట్టిన పరిస్థితుల్లో ఇలా ఈ జాతీయాన్ని ప్రయోగించటం వాడుకలో ఉంది. కుటుంబ సభ్యుల్లోని ఒకవ్యక్తి తన ఇంటిలోనే దొంగతనం చేస్తే పట్టుకోవటం ఎంత కష్టమవుతుందో అలాగే బాగా నమ్మించి మోసం చేసిన వ్యక్తిని కూడా అంతతొందరగా పట్టుకోవడం సాధ్యంకాదనే భావనను ప్రతిబింబిస్తోంది.

మందు నూరటం

చెప్పుడు మాటలతో ఎదుటివారి మనసును మార్చటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది ఆయుర్వేద శాస్త్రపరంగా మందులు నూరే విధానాన్ని అనుసరించి వచ్చింది. ఆయుర్వేదంలో మందు నూరి రోగగ్రస్తుడికి పోసి రోగాన్ని తగ్గిస్తారు. మందు నూరి పోసినందువల్ల అప్పటి దాకా ఉన్న రోగతత్త్వం తగ్గిపోతుంది. అలాగే చెప్పుడు మాటలు విన్నవారు కూడా అంతకు ముందున్న మనఃస్థితిని మార్చుకొని ప్రవర్తిస్తుంటారు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'నిన్నటి దాకా నేనంటే బాగానే ఉన్నాడు. వాడు వెళ్ళి ఏ మందు నూరిపోసాడో ఏమో నేనంటే అసలిష్టపడటం లేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం వినిపిస్తుంది.

తుమ్మడు జగ్గడు

తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో ఈ జాతీయం వినిపిస్తుంది. వూరు, పేరు లేనివారు, జనాభా లెక్కల కోసమని ఉండే వారు అనే అర్థంలో ఇది ప్రయోగంలో ఉంది. 'సభ నిండా కనిపించటానికి తుమ్మడు, జగ్గడు లాంటోళ్ళందరినీ లోపలికి తోశారు' అనే లాంటి సందర్భాలలో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

కళ్ళమీద తెల్లారటం

నిద్రపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రాత్రంతా కనీసం కన్నుమూయలేదు అని చెప్పే భావంతో ఈ జాతీయం సరిపోలుతుంది. పెళ్ళి సమయాల్లో పెళ్ళిపెద్దలు రాత్రిళ్ళంతా మేలుకొనివుండి పెళ్ళి పనులన్నీ చక్కదిద్దుతుంటారు. "నిన్న పెళ్ళివంటలు చేయించటానికి వెళ్ళాము, మా కళ్ళమీదనే తెల్లారింది, అంతగా కష్టపడబట్టే పిండివంటలన్నీ ఇప్పటికి సిద్ధమయ్యాయి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం విన్పిస్తుంది.

ఊళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర

పేదరికంతో ఉన్న కొందరికి రోషం ఉంటుంది. భిక్షాటన చెయ్యటమంటే తప్పని వారు భావించి ఎలాగోలా ఒళ్ళొంచి పనిచేసి తమ జీవనభృతిని సంపాదించుకొంటారు. కానీ కొంతమంది కన్ను, కాలు అన్నీబాగున్నా బద్దకంతో ప్రవర్తిస్తూ భిక్షాటనకు దిగుతారు. అలాగే ఏ మఠంలోనో, గుళ్ళోనో తలదాచుకుంటారు. ఇదంతా వారి సోమరితనానికి గుర్తేతప్ప మరొకటికాదు. ఇలా ఎవరైనా అన్నీ బాగుండి కూడా సోమరితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు "వాడికేంలే వూళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర. ఇల్లూవాకిలి పట్టకుండా తిరుగుతుంటాడు. వాడితో నీకెందుకు" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

తోడిపోయటం

ధారాళంగా, అమితంగా దేన్నైనా, ఎవరికైనా ఇవ్వటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. బావిలోనుంచి నీరు తోడిపోయటం అనే భావం ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. అలా నీరు తోడిపోసేటప్పుడు బాల్చీలోనుంచి నీరు తొణికి కిందపోతోందని, వృథాగా పోతోందని అనుకునే పరిస్థితి ఉండదు. ఓపికున్నంతవరకు నీరు తోడి పోస్తూవుంటారు. అది బావిలోని నీటి సమృద్ధిని తెలుపుతుంటుంది. అలాగే అధికంగా దేన్నైనా, ఎవరికైనా ఇస్తున్నప్పుడు "తమవారికి కోట్ల రూపాయలు తోడిపోయటానికి కావల్సిన పథకాలనన్నిటినీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

నూటికి కోటికి

చాలా అరుదుగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒకటి నుంచి నూరు అంకెలదాక, నూరు నుంచి కోటి అంకెల దాక ఉన్న అంతరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం ప్రచారం లోకి వచ్చింది. ఒకటి లెక్కించిన తర్వాత మళ్ళీ అలాంటిది నూరు సంఖ్యదాక రాలేదంటే దాని ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. అలాగే కోటిలో ఒకటి ప్రత్యేకంగా కనిపించినప్పుడు దాని గొప్పతనమేమిటో అర్థమవుతుంది. అలా ఎంతో అరుదుగా ఏదైనా, ఎవరైనా ప్రత్యేక లక్షణాలతో ఉన్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "అలాంటి వ్యక్తి ఏ నూటికో, కోటికో ఒకడు మాత్రమే కనిపిస్తుంటాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం ఉంది.

రాలిపోవటం

మరణించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చెట్టునున్న కాయ రాలి కిందపడిందంటే ఇక కాయగా దానిజీవితం ముగిసినట్టే. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. చెట్టుకు కాయ వేలాడుతున్నంతసేపు దానిలో జీవం ఉన్నట్టేలెక్క. అది రాలి కిందపడిందంటే ఇక ఆ తర్వాత ఆ కాయ తన ఉనికిని కోల్పోయినట్టే. మనిషి బ్రతకటానికి ఆధారమైన ప్రాణం పోయినప్పుడు నిర్జీవుడై కిందపడిపోతాడు. అలాంటప్పుడు ఆయన రాలిపోయాడు అనటం వినిపిస్తుంది.

గడ్డి ఎవసం

గడ్డి వ్యవసాయం (సేద్యం) అనే పదాల కూర్పుతో అవతరించిన ఈ జాతీయం తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. పిచ్చిపిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ మొలిచి పెరిగే గడ్డిమొక్కల కోసం కష్టపడి వ్యవసాయం చేయాల్సిన పని ఉండదు. ఏమీ కష్టపడకపోయినా, పాదులు చేసి నీళ్ళు పోయకపోయినా మొక్కలు పెరుగుతాయి. అలాంటి మొక్కల కోసం సమయం అంతా వెచ్చించాను అని ఎవరైనా చెపితే హాస్యాస్పదంగానే ఉంటుంది. ఇలాగే కొంతమంది సోమరిపోతులు తాము చెయ్యాల్సిన పనేదీ చెయ్యకుండా కాలం వృథా చేసి ఏదో చేశామంటూ పనికిమాలిన వాటిని తీసుకువచ్చి తమ ప్రతిభగా చెబుతున్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. "బడికి పోతానని రోజూ పొయ్యేవాడు. తీరా సంవత్సరం అయినాక చూస్తే గడ్డి ఎవసం చేసినట్లు ఏడో తిరిగాడని తెలిసింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

జీగంజి

ఇది తెలంగాణ ప్రాంతంలో వినిపించే జాతీయం. ఇతర ప్రాంతాల్లో గంగా జలం, తులసి తీర్థం అనే వాటికి ఇది సమానార్ధకం. ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని జీగంజి అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. ఈ కారణం చేతనే ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది' అనే లాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

బంగాళాఖాతమంత

సువిశాలమైనది, సుదీర్ఘమైనది అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సముద్రం ఎంతపెద్దదో అంత పెద్దదనేది దీనిలోని భావం. ఎవరైనా ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు చెపుతున్నప్పుడు వాటిని ఈ జాతీయంతో సూచించడం కనిపిస్తుంది. 'బంగాళాఖాతమంత ఉపోద్ఘాతం చెప్పి అసలు విషయాన్ని రెండు మాటల్లో ముగించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

మంటలు చల్లారడం

అల్లర్లు ఆగిపోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. గొడవలు, అల్లర్లను మంటలతో పోల్చిచెప్పడం ఆనవాయితీ. మంటలు ఆరిపోయినప్పుడు ఎలాంటి ప్రశాంతస్థితి నెలకొంటుందో అలాంటి ప్రశాంతస్థితే అల్లర్లు ఆగిపోయిన తర్వాత కూడా కనిపిస్తుంది. ఈ కారణంవల్లనే ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో మొన్న చెలరేగిన మంటలు చల్లారినట్త్లెంది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ముడివేయటం

పెళ్లిచేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వివాహ సంబంధ క్రతువులో మూడుముళ్లు వేయడం అనే ఆచారం, వధూవరుల కొంగును ముడివేయడం అనే ఆచారాల ఆధారంగా ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. సంప్రదాయాలు జాతీయాలైన సందర్భాలకు ఇదొక ఉదాహరణ. 'ఈ వేసవిలో ఆ ఇద్దరికీ ముడివేద్దామనుకొంటున్నాం' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

ఒక పంటి కిందికి రావు

ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.. అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా ఇష్టమైన పదార్థాన్ని నోటినిండా వేసుకొని తినడం అందరూ చేసే పనే. అయితే ఇష్టమైన పదార్థం మరీ కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని నోట్లో వేసుకుంటే ఎంతో అసంతృప్తిగా ఉంటుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. 'పట్నం నుంచి మాకోసం తెచ్చిన మిఠాయిలు మాకు ఒక పంటి కిందికి కూడా రావు, ఇంత తక్కువ ఎందుకు తెచ్చావు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

గోతులు తీయడం

కుట్రలు పన్నడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చూడకుండా, తెలుసుకోకుండా నడిస్తే ఎవరైనా గోతిలో పడి ఇక్కట్ల పాలవడం జరుగుతుంది. అలాగే మోసపూరితంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఆ మోసాన్ని గొయ్యితో పోల్చిన కారణంగా ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. "వాడితో జాగ్రత్త. ఇంతకుముందే వాడు తీసిన గోతుల్లో ఎంతోమంది పడ్డారు" అనేటువంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

గుమ్మంలోకి రావడం

దగ్గరకు రావడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏ విషయమైనా ఇంటి వాకిటి ముందుకొచ్చింది అంటే దాదాపు ఇంటిలోకి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. "ఎన్నికలు ఇంటిగుమ్మం ముందుకు వచ్చాయిగా... ఇక ఈ రాజకీయనాయకులు నిద్రపోవడం జరగదు సుమా!" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

పూలపాన్పు

సుఖప్రదమైనది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగం ఉంది. పూలపాన్పుమీద పవళిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. జీవితంలో ఏ ఘట్టంలోనైనా, ఎవరైనా అత్యంత సుఖాలను అనుభవిస్తుంటే "ఆయన జీవితం అంతా పూలపాన్పులా ఉంది" అని అనటం పరిపాటి. అలాగే "జీవితమంటే పూలపాన్పులాంటిది కాదు. అక్కడక్కడా ముళ్ళూ ఉంటాయి" అనేలాంటి లోకోక్తులు కూడా ఉన్నాయి.

గుర్రుపెట్టడం

నిద్రపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నిద్రపోయే సమయంలో కొందరు గురక పెడుతుంటారు. ఆ గురక శబ్దాన్ని ఆధారంగా చేసుకొనే ఈ జాతీయం ప్రచారంలోకి వచ్చింది. అయితే నిజంగా నిద్రపోయినా, పోకపోయినా చేయాల్సిన పనిని చెయ్యకుండా బద్ధకించి పక్కన పడేసిన సందర్భాల్లో కూడా ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "ఇంత గొడవ జరుగుతున్నా.. ఆయన మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు", "ప్రభుత్వ పనితీరును చూస్తుంటే ఏమాత్రం సక్రమంగా కనిపించటంలేదు, ప్రభుత్వం గుర్రుకొడుతుందా అన్నట్లుంది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

సందట్లో సమారాధన

అవకాశం చూసి తమపని నెరవేర్చుకోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. "ఆ విందుకు రావల్సిన నాయకులంతా వచ్చారు. సందట్లో సమారాధనలాగ మా శాసనసభ్యుడి దగ్గరకువెళ్లి నాకు కావలసిన పని అడిగి చేయించుకున్నాను" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

సంతలో చింతపండు

ప్రత్యేకత లేనిది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సంతలో అమ్మకానికి చాలాచోట్ల చింతపండు ఉంటుంది. ఒకచోట కాకపోతే మరొకచోట దాన్ని కొనుక్కోవచ్చు. ఆ చింతపండులో ప్రత్యేకత ఏదీ ఉండనంతవరకు అలా ఎక్కడైనా కొనుక్కోవచ్చని కొనుగోలుదారుడు భావిస్తాడు. ఈ భావన ఆధారంగానే అందరిలాగే ఉండి ప్రత్యేకంగా ఏ ప్రతిభ లేని వ్యక్తిని గురించి చెప్పాలనుకున్నప్పుడు " ఆ.. సంతలో చింతపండులాంటివాడు.. ఆయనగారికోసం అంతగా వెతకాలా ఏమిటి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

సూదిమొన మోపినంత

అత్యంత అల్పం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సూదిమొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలిసిందే. అది మోపడానికి కావల్సినంత స్థలం అంటే ఎంతో ఊహించుకోవచ్చు. ఈ ఊహ ఆధారంగానే అత్యంత అల్పమైనది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. "వాళ్ల నాన్న ఎకరం పొలం కాదుకదా సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని అంటున్నాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కడుపులో ఎలుకలు పరుగెత్తడం

ఎక్కువగా ఆకలి కావడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎలుక తనకు అడ్డం వచ్చినవాటిని కొరకడం సహజం. అలాంటిదే ఎలుకలు కడుపులో పరుగెత్తుతున్నాయంటే అవి కొరుకుతున్నంత బాధ కలుగుతోందని అర్ధం. ఆ బాధను ఆకలితో పోల్చిచెప్పడంవల్ల ఈ జాతీయం అవతరించింది. అంటే ఎలుక కొరికినంత బాధలా ఆకలిబాధ ఉందని చెప్పడం ఇక్కడి అర్థం. "కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఆ భోజనమేదో త్వరగా వడ్డించండి బాబూ" అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

రావణ సంతతివాళ్లు

నాడు రావణుడు అసురుడై ఉండి ఎన్ని అధర్మాలు చేశాడో రామాయణం వివరించి చెబుతుంది. అంతటివాడి సంతతి కూడా చాలావరకు అలాంటి దుర్మార్గాలకే పాల్పడింది. ఆ రావణ సంతతి చేసిన దుర్మార్గాల్లాంటి దుర్మార్గాలనే ఇప్పుడు కూడా ఎవరైనా చేస్తూ కనిపించిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "వాళ్లొట్టి రావణ సంతతి లాంటివాళ్లు. వాళ్లజోలికి ఎందుకు వెళ్లావు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనార్హం.

రాక్షసానందం

ఎదుటివారు భయంతో బాధపడుతుంటే చూసి ఆనందించే నీచ స్వభావాన్ని ఈ జాతీయంతో సూచించటం కనిపిస్తుంది. రాక్షసుల దుర్మార్గవర్తనం, అనైతిక పద్ధతి లాంటివాటిని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. "ఓ పక్క వాడు జారి కిందపడితే చూసి నవ్వటం రాక్షసానందం కాక మరేమిటి చెప్పు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఎర్రటోపీవాళ్లు

కొన్ని వస్త్రధారణలు, వేషధారణలు కూడా జాతీయాలుగా అవతరించిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటివాటిలో ఇదికూడా ఒకటి. 'పోలీసువాళ్లు' అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. ఇంతకుముందు పోలీసు కానిస్టేబుళ్లు ఎర్రటోపీ ధరిస్తుండేవారు. ఆరోజుల్లో ఆవిర్భవించిందీ జాతీయం. "అక్కడ గొడవ జరుగుతున్న విషయం తెలుసుకుని ఎక్కడనుంచి వచ్చారో ఏమో కానీ ఎర్రటోపీవాళ్లు వచ్చిపడ్డారు, అందినవాళ్లను అందినట్లు బాదారు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఒడిలోకొచ్చి పడడం

దక్కడం, లభించడం అనే అర్థాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏదైనా ఒడిలో ఉండడమంటే ఎవరికైనా అది సొంతమైందేనని అర్థం. ఈ అర్థాన్ని ఆధారంగా చేసుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'నువ్వంతగా కష్టించినా నీకు ఒడిలోకొచ్చి పడేదేమీలేదు, మరీ అంతగా శ్రమించకు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

వీపుమీద బాకు గుచ్చడం

వెన్నుపోటు లాంటిదే ఇది. నమ్మకద్రోహం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ముందు మంచిగా నటిస్తూ వెనకనుంచి ఎవరైనా ద్రోహం తలపెట్టిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడాన్ని గమనించవచ్చు. "ఆయన తన పక్షంవారికే వీపుమీద బాకు గుచ్చి గెలిచాడు. అదీ ఓ గెలుపేనా" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఒళ్లు మండడం

అయిష్టం, కోపం రావడం అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శారీరకంగా కోపం వచ్చినప్పుడు కలిగే పరిణామాల ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. నిజంగా ఒళ్లు మండుతున్నట్టు అనిపించినా, అనిపించకపోయినా ఏదైనా విషయం ఇష్టంలేదని చెప్పాల్సి వచ్చినప్పుడు "నాకదంటే ఒళ్లు మంట" అనే సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

కాచి వడబోయడం

పూర్తిగా సారాన్ని గ్రహించడం, అవగాహన చేసుకోవడం అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. "దాన్నిగురించి ఆయనకు మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన దాన్ని కాచి వడబోశాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

చప్పగా ఉండడం

నిస్సారంగా ఉండడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏ పదార్ధమైనా ఉప్పు, కారం, తీపి, పులుపు లాంటి రుచులేవీ లేకుండా ఉంటే దాన్ని ఎవరూ ఇష్టపడరు. ఈ భావన ఆధారంగానే ఎవరికీ నచ్చని విధంగా ఎవరైనా ఏ పనైనా చేసినప్పుడు, ఆ పనిలో ఎలాంటి సారమూ లేనప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'రాత్రి చూసిన నాటకం నాకెందుకో చప్పగా అనిపించింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.

అధఃపాతాళానికి చేరటం

దిగజారిపోవడం, పతనమవ్వటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాతాళం ఎక్కడో అడుగున ఉంటుంది. అంత అట్టడుగుకు చేరటమంటే ఇక కనిపించకుండా పోవటమనే ఓ భావన ఉంది. ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సినవారు తప్పులుచేసి నైతికంగా విలువను కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనుపిస్తుంది. "నిన్నటి ఆయన ప్రవర్తన ఆయనను అధఃపాతాళానికి చేర్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

శీర్షాసనం వెయ్యడం

తారుమారు కావడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఆసనాల ప్రక్రియలో శీర్షాసనం వేసేటప్పుడు తల కిందకు, కాళ్లు పైకి ఉండేలా ఆసనం వేస్తారు. అంటే కాళ్లు ఉండాల్సినచోట తల, తల ఉండాల్సినచోట కాళ్లు ఉంటాయి. దీని ఆధారంగా ఏ విషయమైనా తారుమారు అయినప్పుడు ఈ జాతీయం ప్రయోగించడం కనిపిస్తుంది. "ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ రాజకీయపక్షం పరిస్థితి శీర్షానమేసినట్త్లెంది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ పయోగం కనిపిస్తుంది.

కసాయి కత్తులు

నిర్దాక్షిణ్యమైనవి, నిర్దాక్షిణ్య వైఖరిని అవలంబించేవారు అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కసాయివాడి చేతిలోఉన్న కత్తికి, కసాయివాడికి దయాదాక్షిణ్యం ఉండవు. అలాగే ఏమాత్రం కరుణ చూపకుండా ఎవరైనా ప్రవర్తిస్తున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. "ప్రతిపక్ష రాష్ట్రాల్లోని గవర్నర్లు కేంద్రం చేతిలోని కసాయికత్తుల్లా తయారయ్యారని అనిపిస్తోంది" అనేలాంటి సందర్భాల్లో ఇది ప్రయోగంలో ఉంది.

లెక్కతీరిపోవడం

మరణించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'నిన్న రాత్రితో ఈ లోకానికి, ఆయనకు లెక్క తీరిపోయింది' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

నాలుగ్గోడల మధ్య

పరిమిత ప్రదేశంలో, ఇంటిలో అనే అర్ధాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎప్పుడూ బయటికి రాకుండా కొన్ని పరిమితులు, పరిధులు ఏర్పాటు చేసుకొని ఉండేవారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "ఇంతకాలం నాలుగ్గోడల మధ్య ఉన్న వ్యక్తి కావటంతో బయటి ప్రపంచం అసలు తెలియకుండా పోయింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కత్తులు దూయడం

గొడవ పడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వకాలపు యుద్ధపద్ధతిలో రణరంగంలో శత్రువు మీదకు కత్తులు దూసి వెళ్లేవారు. తన విరోధిని అంతం చేయాలన్న లక్ష్యం ఈ స్థితిలో ఉండేది. అదే పద్ధతిలో నిజంగా కత్తులు చేతపట్టి తన విరోధి మీదకు వెళ్లకపోయినా మాములుగా గొడవ చేసేందుకు వెళ్లిన సందర్భమే అయినా ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. అంటే విరోధ తీవ్రతను తెలియజేయడానికి ఇలా ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారన్నది భావం. "పాలకవర్గం, ప్రతిపక్షం ఆ విషయమై కత్తులు దూసుకోవడం ఏమంత సమంజసం కాదనిపించింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

ఇంద్రుడు, చంద్రుడు

విపరీతంగా పొగడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. భోగాలను అనుభవించడంలో ఇంద్రుడికి, అందంగా ఉండడంలో చంద్రుడికి ఎవరూ సాటి లేరని అతిశయోక్తులు చెప్పుకోవడం లోకంలో ఉంది. ఈ భావం ఆధారంగానే ఎవరినైనా బాగా పొగడదల్చుకున్నప్పుడు మీకేంటి, భోగభాగ్యాలను అనుభవించడంలో ఇంద్రుడి లాంటివారు, అందం, ఆకారంలో చంద్రుడంతటి వారు అని పొగిడినంతగా... ఉన్నవీ లేనివీ కల్పించి ఎవరినైనా పొగుడుతున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

ఓనమాలు తెలియనివాడు

అనుభవం లేనివాడు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అక్షరాభ్యాస సమయంలో ఓనమాలను దిద్దిస్తారు. ఆ అక్షరజ్ఞానంతో క్రమంగా విద్యలన్నీ అభ్యసించి జీవితంలో ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతటి అనుభవ స్థితి ఆనాడు ఓనమాలు దిద్దబట్టే వచ్చిందనీ, ఆ ఓనమాలే దిద్దకపోతే జీవితం అంతా జ్ఞాన, అనుభవ శూన్యమేనన్నది భావం. ఈ భావాన్ని అనుసరించే ఎవరైనా అనుభవం లేని స్థితిలో కనిపించినప్పుడు "వాడికింకా ఈ విషయంలో ఓనమాలే తెలియవండీ, అందుకే అలా అయింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

రంభగూడు

రంభకు సంబంధించిన గూడు అనేది దీని అర్ధం కాదు. రంభను కూడడం అంటే రంభను చేరడం అనేది ఇక్కడ అర్ధం. ఇంకా వివరాల్లోకి వెళ్తే... రంభ ఉండేది స్వర్గలోకంలో కనుక అక్కడికి వెళ్ళాడు అనే భావం స్ఫురిస్తుంది. దాని అర్ధాన్ని తీసుకుంటే స్వర్గస్తుడయ్యాడు, మరణించాడు అనే అర్ధాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

విరగపడి చూడటం

చాలా ఆసక్తితో చూడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ విషయాన్ని గురించైనా అమితంగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆ విషయం జరిగిన చోటుకు చేరిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. "ఆ సినిమాను జనమంతా విరగపడి చూస్తున్నారు. అంత గొప్పతనం దానిలో ఏముందో నాకైతే అర్ధం కావటంలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం ఉంది.

చిన్న ఇల్లు

రెండో భార్య ఇల్లు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంటే చిన్నభార్య ఉండే ఇల్లు అన్నది అంతరార్థం. ఒకసారి వివాహమైన తర్వాత కారణాంతరాల వల్ల బయటకు తెలిసో తెలియకుండానో ఉండేలా ఎవరైనా రెండో వివాహం చేసుకున్న సందర్భంలో లేదా వివాహేతర సంబంధం ఉన్న సందర్భాల్లో కూడా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఈ మధ్య వాడు చిన్నిల్లు పెట్టాడట. అందుకే మన దగ్గరకు ఎక్కువగా రావడంలేదు' అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనార్హం.

కబంధ హస్తాలలో చిక్కడం

తప్పించుకోలేని విషమ పరిస్థితులు ఏర్పడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రామాయణంలో కబంధుడి ప్రస్తావన ఉంది. కబంధుడి చేతులలో చిక్కినవారెవరూ బతికి బయటపడడం నాడు సాధ్యమయ్యేదికాదు. అంత క్లిష్ట పరిస్థితులు వచ్చాయని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

రయ్‌మని వెళ్ళటం

తెలుగు భాషలో కొన్ని జాతీయాలు అనుకరణ శబ్దాల నుంచి ఆవిర్భవించాయని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. రయ్‌మని వెళ్ళటమంటే అమిత వేగంగా వెళ్ళటమనేది అర్ధం. బాగా వేగంగా కదిలేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జాతీయం వచ్చింది. అయితే... ఇది ప్రయోగంలో సాధారణంగా వేగంగా వెళ్ళటాన్ని సూచించినా అభివృద్ధి బాగా జరుగుతోంది అని చెప్పే సందర్భాల్లో కూడా ఇది ప్రయోగంలో కనుపిస్తుంది. సైకిల్‌మీద రయ్‌మని దూసుకువెళుతున్నాడు, వ్యాపారంలో రయ్‌మని ముందుకు వెళుతున్నాడు అనేలాంటి సందర్భాలు ఈ జాతీయ ప్రయోగానికి ఉదాహరణలుగా కనుపిస్తున్నాయి.

రాసుకొని పూసుకొని

మితి మీరిన అనుబంధం కలిగి ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇద్దరు వ్యక్తులు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు అని, వారి మధ్యన ఆప్యాయత అనురాగాలు అవధులు లేకుండా ఉన్నాయని తెలియ చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. 'ఆ ఇద్దరు నిన్నటిదాకా బాగా రాసుకొని పూసుకొని తిరిగారు, ఇవ్వాళేమో ఒకరికొకరు తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు..' అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలన పడడం

పని ఆగిపోవడం లేదా ఏదైనా పనికిరాకుండా పోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఇంట్లో పనికిరాని వస్తువులను తీసి ఎవరికీ అడ్డురాకుండా ఓ మూలన పడవేస్తుంటారు. అంటే ఇక వాటివల్ల ఉపయోగం లేదని అనుకున్నందు వల్లే అలా చేస్తారు. ఈ భావం ఆధారంగానే వ్యక్తులపరంగా అయితే అనారోగ్యం పాలైనప్పుడు, వస్తువుల పరంగా అయితే సాంకేతికంగా సరిగా లేనివి, విరిగిపోయినవి తదితర వస్తువులను గురించి ప్రస్తావించేటప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇటీవల కళాశాలల్లో అధ్యాపకుల సామూహిక బదిలీల వల్ల విద్యార్థుల చదువు మూలన పడింది' అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తులు, వస్తువులు కాకపోయినా ఏదైనా విషయం సక్రమంగా అమలు జరగని పరిస్థితుల్లో కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

బుసలు కొట్టడం

కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పాముకు కోపం వచ్చినప్పుడు బుసలు కొట్టడం సహజం. అలాగే ఎవరైనా పగతీర్చుకోవాలనో, మరేదైనా కారణంతో తమ కోపాన్ని వెలిబుచ్చేటప్పుడు తీవ్రంగా మాట్లాడుతుంటేనో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. "ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లవద్దు. ఎవరిమీదో తెగ బుసలు కొడుతున్నాడు. నువ్వు వెళ్తే నీమీద కూడా బుసలు కొట్టొచ్చు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.

రాళ్లు రువ్వడం

నిందారోపణలు చేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరిమీదకైనా రాయి రువ్వితే రాయి తగిలిన వ్యక్తి ఎంతో బాధకు గురవుతాడు. విలవిల్లాడతాడు. అలాంటి బాధనే నిందలు అనుభవిస్తున్న వ్యక్తి కూడా అనుభవిస్తాడన్న భావం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'వాస్తవానికి వాడు మంచివాడే. ఇదుగో వీడే లేనిపోనివి కల్పించి రాళ్లురువ్వి బాధపెడుతున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

ఇంగువ కట్టిన గుడ్డ

గతవైభవ చిహ్నం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. వంటకాలలో ఇంగువను వాడుతుంటారు. ఈ ఇంగువ వాసన ఘాటుగానే ఉంటుంది. దాన్ని ఉంచిన గుడ్డకు దాని వాసన అంటుతుంది. ఇంగువ అయిపోయినా కూడా అది కట్టిన గుడ్డలో ఇంగువ ఉన్నట్లుగానే అనిపించేలా చాలాకాలంపాటు వాసన వస్తుంటుంది. ఈ భావన ఆధారంగా గతంలో ఎంతో వైభవంగా ఉండి ప్రస్తుతం ఆ వైభవానికి సంబంధించిన విషయాలు ఏవీ లేకపోయినా ఆ వైభవాల స్మృతులు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది.

అరివీర భయంకరుడు

అరివీరుడు అంటే వీరుడైన శత్రువు అని అర్థం. అలాంటి బలమైన శత్రువులకు అంతకంటే బలమైనవాడు ఎదురైతే వాడిముందు ఆ వీరులైన శత్రువులంతా నశించిపోవలసిందే. ఈ భావం ఆధారంగానే గొప్ప గొప్ప శత్రువులను, మహాబలవంతులైనవారిని మించిన బలవంతుడు, అత్యంత సమర్ధుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'వాడి జోలికి వెళ్లొద్దు, వాడసలే అరివీర భయంకరుడు సుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

ఊ అన్నా... ఆ అన్నా...

మాటమాటకీ, తరచుగా అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ప్రత్యేకించి ఏ భావమూ వ్యక్తపరచకపోయినా ఏమాత్రం మాట్లాడినా ఆ మాటలకు కొంతమంది పెడార్థాలను చెప్పుకున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "వాడితో అసలు మాట్లాడలేము. వూ అన్నా.. కోపమే, ఆ అన్నా.. కోపమే, ఆ ఇంట్లోవాళ్ళు ఎలా భరిస్తున్నారో మరి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కళ్లనీళ్లు తుడవడం

ఓదార్చడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. దుఃఖం కలిగినప్పుడు కళ్లవెంట నీరు రావడం సహజం. అలా వచ్చిన నీళ్లను దుఃఖిస్తున్న వ్యక్తి లేదా అక్కడ ఎదురుగా ఉన్న అతడి అభిమాని అయినా తుడవవచ్చు. దుఃఖం నుంచి ఉపశమనం కలిగించడానికి ఎదుటివారు అలా కళ్లనీళ్లు తుడుస్తారు. అయితే ఇది జాతీయంగా వాడుకలోకి వచ్చేసరికి దుఃఖం ఉన్నా లేకపోయినా, నిజంగా కళ్లవెంట నీరు వచ్చినా రాకపోయినా ఎదుటివారి మనసుకు కొంత ప్రశాంతత కలిగించేందుకు చేసే పనులను ఈ జాతీయంతో సూచించడం కనిపిస్తుంది. 'ఈ పథకాలు పేదప్రజల కన్నీరు తుడవడానికే సుమా' అనేలాంటి సందర్భాల్లో దీని ప్రయోగం కనిపిస్తుంది.

కాలుదువ్వడం

ఘర్షణకు సిద్ధపడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అయితే ఇది జంతువుల స్వాభావిక చర్య ఆధారంగా ఆవిర్భవించిందని పండితులు చెపుతారు. ఎద్దులాంటి జంతువు మరో జంతువుతో పోరాడడానికి సిద్ధమయ్యేటప్పుడు నేలమీద కాలు వేగంగా దువ్వుతూ తోక పైకెత్తి తన కోపాన్ని ప్రకటిస్తున్నట్లు కనిపిస్తుంది. మానవ వ్యవహారంలో ఇలాంటిదేదీ లేకపోయినా తన శత్రువులపై అధిక కోపాన్ని ఎవరైనా ప్రకటిస్తూ పోట్లాటకు సిద్ధమైనప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

లేవనెత్తడం

ప్రస్తావించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా అయితే కిందపడిన వస్తువునో, మరి దేన్నైనా పైకి ఎత్తడం అనేది దీని అర్థం. అయితే జాతీయంగా ప్రయోగించేటప్పుడు... విస్మరించిన ఓ అంశాన్ని కానీ, ఎవరి దృష్టీ అంతగా పడని విషయాన్ని కానీ పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం అనేది దీని అర్థం. 'ఆ నాయకుడు లోక్‌సభలో ఇదే విషయాన్ని లేవనెత్తి సంచలనం కలిగించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

రక్తం తాగడం

దోచుకుతినడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. నిజంగా మనిషి శరీరంలోని రక్తాన్ని బయటకు తీసి తాగకపోయినా అలా హింసిస్తే ఎంతటి బాధ కలుగుతుందో తెలియజెప్పేందుకు ఈ జాతీయాన్ని ప్రయోగించడం జరుగుతుంది. 'ఈ రాజకీయనాయకులు పేదోళ్ల రక్తం తాగి బతికేస్తున్నారు' అనే లాంటి సందర్భాలలో ప్రయోగంలో ఉన్న ఈ జాతీయం పేదవారిని ఏదో ఒక వంకన రాజకీయ నాయకులు దోచుకుంటున్నారనే అర్ధాన్ని స్ఫురింపజేస్తుంది.

మెడలు వంచడం

బలవంతంగా లొంగదీయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. బలవంతుడైన వ్యక్తి ధైర్యంతో నిటారుగా ఉండడం, శారీరకంగా అతడి దృఢత్వానికి గుర్తుగా కనిపిస్తుంది. అంతటి బలవంతుడిని కూడా అంతకంటే వేరొక బలవంతుడు వచ్చి అతడి మెడ వంచి తన బలాన్ని నిరూపించుకుంటే మొదటివాడు లొంగినట్లుగా భావిస్తాం. అయితే నిజంగా అలా శారీరకంగా బలాన్ని ఉపయోగించి మెడను వంచకపోయినా, గట్టి పట్టుదలతో ఉన్న వ్యక్తిని అతడి పట్టుదల సడలి.. తమమాట వినేలా చేసుకున్న సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'ఇష్టం లేకపోయినా వాళ్ల పెద్దలు మెడలు వంచి ఆ పెళ్లి చేశారు.' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

కుదిపేయటం

ఆందోళన కలిగించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గమనం మామూలుగా సాగుతూ ఉంటే హాయిగానే ఉంటుంది. కానీ ఎత్తునుంచి పల్లానికి పడ్డప్పుడు ఎత్తుకు ఎక్కలేకపోతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఈ స్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి భావానికి ప్రతీకగానే జీవితం మాములుగా సాగిపోతున్నప్పుడు ఏ కారణం చేతనైనా ఆందోళనకర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "నిన్న జరిగిన సంఘటన అతడిని బాగా కుదిపేసింది. ఇప్పుడిప్పుడే కోలుకొనేలా లేడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగాన్ని గమనించవచ్చు.

రావణ దాడి

రామాయణంలోని ప్రతి నాయకుడు రావణుడు. ఎంత అధర్మంగా, అడ్డ దోవల్లో అనైతికంగా ప్రవర్తించాడో అందరికీ తెలిసిన విషయమే. అదే తీరులో ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ప్రవర్తనను సూచించటానికి ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. ఎవరైనా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు వారి ప్రభావానికి మరొకరు లోనుకావటాన్ని కూడా దీనితోనే సూచించటం ఉంది. 'విశ్వవిద్యాలయాల మీద రాజకీయ ప్రభావం రావణ దాడిలా ఉంది', 'అతడి ప్రవర్తన రావణ దాడి, దానిలో అతడిచుట్టూ ఉన్న వారంతా ప్రభావితమై పాడై పోతున్నారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కన్పిస్తుంది.

రాళ్లు వేయడం

విమర్శించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వకాలంలో చెడుగా ప్రవర్తించిన వారి మీదకు రాళ్లను విసురుతూ శిక్షించడమనే పద్ధతి ఒకటుండేది. అంటే నడవాల్సిన రీతిలో కాక ధర్మవిరుద్ధంగానో, ఆచార విరుద్ధంగానో నడవడమనేది శిక్షార్హం. అలా ప్రవర్తిస్తే మాటపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తమకు నచ్చని తీరులో పనిచేసినప్పుడు ఎవరైనా విమర్శిస్తుంటే 'జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే విన్నవాళ్లు రాళ్లు వేయగలరు సుమా', 'వాడికి ఎదుటివారు ఏం మాట్లాడినా రాళ్లు వేయడమే పని' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

భజన

పొగడ్త అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దైవపరంగా చేసే భజనలో దైవాన్ని పొగుడుతారు. ఆ పొగడ్త కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండటం సహజం. అలా భజనలో మాదిరిగానే ఎవరైనా ఏదో ఒక స్వార్ధాన్ని దృష్టిలో ఉంచుకొని లేదా అభిమానంతోనైనా విపరీతంగా పొగుడుతున్నప్పుడు 'వాడు నిరంతరం ఆయన భజనలోనే కాలం గడుపుతున్నాడు. అలాగైనా పని సాధించాలన్నది వాడి ఆలోచన' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కన్పిస్తుంది.

వీధికెక్కడం

బయటపడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా అభిప్రాయ భేదాలు వచ్చాయనే విషయం ప్రస్తావించినప్పుడు ఈ జాతీయాన్ని వాడడాన్ని గమనించవచ్చు. 'ఇరుపక్షాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఇప్పుడు ఆ ఇద్దరూ వీధికెక్కారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

కప్పదాటు వైఖరి

సమస్య నుంచి తప్పించుకు తిరగడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కప్ప మాములుగా నేలబారున నడవక గంతులేస్తూ వెళ్తుంది. ఇదే పద్ధతిలో ఎదురుగా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించకుండా, సాధించకుండా వేరే మార్గంలో తప్పించుకుపోయే పద్ధతిని కప్పదాటు పద్ధతి అనడం కనిపిస్తుంది. 'అడిగిన విషయం గురించి మాట్లాడకుండా ఆయన కప్పదాటుడు వైఖరితో ఉండడం ఏమీ బాగోలేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

ముఖం చాటేయడం

ఎదురుపడలేకపోవడం, తప్పించుకు తిరగడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒకరు మరొకరిమీద అసంతృప్తిని, అనుమానాన్ని మనసులో కలిగిఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎదుట పడాలని అనిపించకపోవడం మానవ సహజం. ఇలాంటి సహజ లక్షణాల ఆధారంగా అవతరించిందీ జాతీయం. 'తన విషయం అందరికీ తెలిసిందనుకున్నాడు. అందుకే ఇటు రాకుండా ముఖం చాటేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కన్పిస్తుంది.

రంగు తేలిపోవడం

ప్రతిష్ట కోల్పోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పరువు-ప్రతిష్ట ఉన్న వ్యక్తికి సమాజంలో మంచి స్థానం ఉంటుంది. అతనంటే ఒకవిధమైన గుర్తింపు, ప్రత్యేకత ఉంటాయి. ఇలా ఉన్న వ్యక్తి ఏ కారణంచేతనైనా పరువుతక్కువ పనిచేసి దోషిగా కనిపించినప్పుడు, అంతకుముందు అతడి మీద ఉన్న అభిప్రాయం సడలిపోయి.. అతడంటే అసహ్యించుకునే స్థితి కూడా వస్తుంది. ఇలాంటి స్థితినే ఈ జాతీయంతో పోల్చిచెబుతారు. అందంగా, ఆరోగ్యంగా ఉండడాన్ని మంచి రంగుగా ఉండడంగా పోల్చిన నేపథ్యం నుంచి ఈ జాతీయం ఆవిర్భవించింది.

అడ్డుకట్ట వేయడం

అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పని చేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

లింగపోటు

జాతీయాలు కొన్ని సంప్రదాయాల నేపథ్యం నుంచి ఆవిర్భవించాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శైవమతాన్ని ఆచరించేవారికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో మెడలో శివలింగాన్ని ధరించడం కూడా ఒకటి. ఇలా ధరించిన ఓ భక్తుడి అనుభవం ఈ జాతీయ ఆవిర్భావానికి కారణమైంది. ఆ శివభక్తుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి శివభక్తుడు పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు. దొంగ బాధ నుంచి సురక్షితంగా ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ బాగా బాధ కలిగించిందట. ఆ శివలింగాన్ని మెడలో వేసుకొనేటప్పుడు కానీ, ఆ తర్వాత కానీ శివభక్తుడు దాని దెబ్బ తనకు తగులుతుందని ఊహించలేదు. అనుకోనివిధంగా అతడు శివలింగపు దెబ్బతినాల్సి వచ్చింది. ఇలా అనుకోకుండా ఎప్పుడైనా ఎదురైన కష్టాలను గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

తథాస్తు పలకడం

ఆమోదించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తథాస్తు అనే సంస్కృత పదానికి అట్లే అగుకాక అని అర్థం. దీన్ని అనుసరించే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. దేవతలలో కూడా తథాస్తు దేవతలుంటారన్నది ఓ నమ్మకం. మనుషులు ఏది అనుకుంటున్నా దానికల్లా ఆ దేవతలు తథాస్తు అని అంటుంటారని కనుక ప్రతివారు చెడు అనుకోకుండా మంచిమాత్రమే అనుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ జాతీయం విషయానికొస్తే ఒక వ్యక్తి ఎదుటివ్యక్తి భావాలను అంగీకరించి తన ఆమోదాన్ని ప్రకటించిన సందర్భంలో "ఆపనికి ఆయన అడ్డుపడతాడనుకున్నాం. కానీ ఆనందంతో తథాస్తు పలికాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కుంపట్లు

విభేదాలు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుంపట్లో నిప్పులు ఉంటాయి. అవి రాజుకుంటే వేడిపుడుతుంది. అసహనం, భేదాభిప్రాయాలు... ఇలాంటివాటిని నిప్పుతోను, మితిమీరిన వేడితోను పోల్చిచెప్పడంవల్ల ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. "తన సొంత పక్షంలో కుంపట్లు రాజుకున్నందువల్లనే ఆ నాయకుడి పరిస్థితి అలా దిగజారాల్సి వచ్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

విభీషణుడు

ధర్మపాలన కోసం ఎంత త్యాగమైనా చేసేవాడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పురాణాలు, ఇతిహాసాల్లోని కొన్ని ఆదర్శ పాత్రలు ఇలా జాతీయాలుగా మారాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆనాడు విభీషణుడు తన అన్న రావణాసురుడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించి తనవంతు బాధ్యతగా అతనికి చెప్పాల్సినదంతా చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. ఇక చేసేదిలేక విభీషణుడు తన అన్న శత్రువైనప్పటికీ ధర్మ పరిపాలకుడైన రాముడి పక్షాన చేరాడు. ఇలాంటి పరిస్థితే ఎక్కడైనా ఎదురైనప్పుడు విభీషణుడి లక్షణాలున్న వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "ఆయన్నేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. సాక్షాత్తూ విభీషణుడే సుమండీ!" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.

ఉక్కుమనిషి

లోహాలలో ఉక్కుకు ఉన్న దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ఆవిర్భవించింది. దృఢచిత్తుడు అనే అర్థంలో ఇది వాడుకలో ఉంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి పట్టుదలతో ఉంటాడన్నది భావం. 'ఆయన ఉక్కుమనిషి. ఆయన ముందు ఎలాంటి జిత్తులు పనికిరావు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

పిండి పిప్పిచెయ్యడం

అధికంగా బాధించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏవైనా పండ్లు, చెరకుగడల వంటివి మాములుగా చూస్తే ఎంతో బాగుంటాయి. అయితే వాటిలోని రసాన్ని తీసేందుకు బాగా పిండి రసమంతా తీసేసి పిప్పిచేసిన తర్వాత అంతకుముందు చూసిన రూపం కనిపించదు. రసం పిండడానికి, పండు పిప్పి కావడానికి మధ్య ఎంతో ఒత్తిడికి గురికావలసి ఉంటుంది. అలాంటి ఒత్తిడిని ఎవరైనా అనుభవిస్తూ అధిక బాధలు పడుతూ ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. ' ఈమధ్య పని ఎక్కువగా చెప్పి యజమాని అతడిని పిండి పిప్పిచేస్తున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

భగ్గున మండడం

అధికంగా ఆగ్రహించడం, విపరీతంగా కోపగించుకోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కోపాన్ని, ఆగ్రహాన్ని అగ్నితో పోల్చి చెప్పడం వల్ల ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'పచ్చని పల్లెటూళ్లు ప్రస్తుతం రాజకీయ తగాదాలతో భగ్గుమంటున్నాయి' అనే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

వేరుకుంపట్లు పెట్టుకోవడం

అంతర్గత కలహాలతో విడిపోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంతా ఓ కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు ఒకే పొయ్యిమీద వంట చెయ్యడం, అందరూ కలిసి తినడమనేది సహజం. కానీ ఆ ఇంటివారు విభేదాలతో విడిపోయినప్పుడు వేర్వేరుచోట్ల ఉంటూ వేర్వేరు కుంపట్లమీద వంట వండుకోవడం జరుగుతుంటుంది. ఇలాగే ఎవరైనా అప్పటిదాకా కలిసివుండి కారణాంతరాలవల్ల విడిపోయి వేర్వేరుగా ఉంటున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "అభిప్రాయ భేదాలొచ్చాయి, అందుకే ఆ నాయకులు విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

సంకెళ్ళు వేయటం

సాధారణంగా దోషికి సంకెళ్ళు వేయటం అనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఈ సంకెళ్ళు వేయటం అనేది జాతీయంగా వాడుతున్నప్పుడు నిరోధించటం అనే అర్థంలో ప్రయోగిస్తుంటారు. సంకెళ్ళు పడిన దోషి ఎలాగైతే ఎక్కడికీ కదలలేని స్థితి ఉంటాడో అలాగే దేన్నైనా.. కదలనివ్వని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "ప్రభుత్వం చేస్తున్న ఈ పని సమాజ ప్రగతికి సంకెళ్ళు వేస్తున్న తీరుగా కనిపిస్తోంది" అనే సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.

మూగనోము పట్టడం

సంప్రదాయంగా వచ్చే వ్రతాలు, నోములలో ఒకటేమోనని అన్పించే ఈ జాతీయం వాటిలోది మాత్రం కాదు. కేవలం నిశ్శబ్దంగా ఉండడం, మౌనం వహించడం అనే అర్థాలలో వాడేందుకే దీన్ని ప్రయోగిస్తుంటారు. ఆకాశవాణి ప్రసారాల విషయంలోను, దూరవాణి(టెలిఫోన్‌) ప్రసారాల విషయంలోను అంతరాయాలేర్పడ్డప్పుడు, ఎక్కువ సమయంపాటు అవి పనిచేయకుండా పోయినప్పుడు ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. 'పెనుగాలుల ఫలితమేమో మరి... పొద్దుటినుంచి అటు రేడియో, ఇటు టెలిఫోన్‌ మూగనోము పట్టాయి' అనే సందర్భాల్లో ఈ జాతీయం విన్పిస్తుంది.

పైచేయి

ఆధిక్యం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా ఒకరు మరొకరికన్నా ఎక్కువ అభివృద్ధిలో ఉండడం జరిగినప్పుడు ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. 'ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షంవారిదే పైచేయిగా ఉండేలా కనిపిస్తోంది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనార్హం. 'ఎంతమంది పోటీకి దిగినా అతడిదే పైచేయి సుమండీ' అనేలాంటి సందర్భాల్లో కూడా ఈ జాతీయం వినిపిస్తుంది.

సారథి

నాయకుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సారథ్యం వహించడమంటే ఓ రథాన్ని తోలుకువెళ్లడమని సాధారణ అర్థం. అయితే ఇలా జాతీయ రూపంలోకి వచ్చినప్పుడు ఓ విషయానికి లేదా కొంతమందికి నాయకత్వం వహించడమనే అర్థం కనిపిస్తుంది. 'ప్రస్తుతం ఆ రాజకీయపక్షం అతడి సారథ్యంలో ముందుకు సాగుతోంది' అనేలాంటి సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.

వీరభద్రుడు కావడం

వీరభద్రావతారం ఎత్తడం అనే రూపంలో కూడా ఈ జాతీయం వాడుకలో ఉంది. ఈ జాతీయం పురాణ కథల ఆధారంగా ఆవిర్భవించింది. దక్షయజ్ఞం విధ్వంస సమయంలో శివుడు సృష్టించిన వీరభద్రుడు ఎంత ఉగ్రుడుగా ఉన్నాడో అంతటి ఉగ్రాన్ని ఎవరైనా ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆయన వీరభద్రుడైపోతాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడడం కనిపిస్తుంది.

విషం చిమ్మడం

ద్వేషాన్ని ప్రదర్శించడం, కల్లోలం చేయడం అనే అర్థాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరిమీదకైనా విషం చల్లితే దాని ప్రభావంతో వారు అనేక బాధలకు గురవుతారు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ద్వేషం కూడా విషంలాంటిదేనన్న పోలికతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. "పచ్చని బతుకుల్లో దుర్మార్గపు రాజకీయాలు విషం చిమ్మాయి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడుతుంటారు.

ఆర్చటం తీర్చటం

కష్టాలను పోగొట్టడం, కాపాడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోఉంది. కష్టాల వల్ల కలిగే బాధను సమసింపజేసి ఊరట కలిగించి చేయూతనిచ్చే సమయంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. "ఇన్నాళ్ళూ నా కష్టాలను ఆర్చేదెవరో తీర్చేదెవరోనని మదనపడ్డాను. ఇన్నాళ్ళకు ఈయన కనిపించాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

అగ్నిస్నాతుడు

పవిత్రుడు అని అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మాములుగా అయితే అగ్నితో స్నానం చేసినవాడు అనేది అర్థం. పూర్వకాలం ప్రచారంలో ఉన్న అగ్నిపరీక్షలాంటివాటి నేపథ్యంలో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఆయన అగ్నిస్నాతుడు. అలాంటిలాంటివాడు కాదుసుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.

తక్షకులు

హాని కలిగించేవారు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తక్షకుడు సర్పరాజు. సర్పయాగంలో కూడా ఇంద్రుడిని ఆశ్రయించి బతికి బయటపడ్డాడు. తక్షకుడి దగ్గర ఉన్న వినాశనశక్తి సామాన్యమైనది కాదు. ఎంతటిదాన్నైనా మాడ్చిమసి చేయగలదు. అలా తక్షకుడిలా విషస్వభావంతో అంటే మోసపూరిత, దుర్మార్గస్వభావంతో ఎవరన్నా ప్రవర్తిస్తున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇన్నాళ్లూ అతడు రక్షకుడనుకున్నాం, కానీ తక్షకుడై నాశనం చేస్తాడని అనుకోలేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

ఉడుతలు పట్టేవాడు

ఏ పనీ చెయ్యనివాడు, సోమరిపోతు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఉడుతలు పట్టడమనేది వాటిని చంపి తినడం కోసం కాదు. ఈ జాతీయం ఆవిర్భావం వెనుక పూర్వకాలపు సామాజిక స్థితి ఒకటి దాగివుంది. ఉడుత వెంట్రుకలు బిగుసుగా ఉండి రంగులద్దే కుంచె తయారుచేయడానికి అనువుగా ఉంటాయి. ఆనాటి చిత్రకారులు అందుకే మాటువేసి ఉడుతలను పట్టి కుంచెలు చేసుకుంటూ ఉండేవారు. ఆరోజుల్లో చిత్రకారులు, నటులు లాంటి కళాకారులకు పెద్దగా సమాజంలో గౌరవం ఉండేదికాదు. అందుకే చిత్రకారుడు ఉడుతలను పట్టడం చూసినవారు దానిని నిందిస్తూ గౌరవప్రదమైన పని చేయనివాడుగా ఆ చిత్రకారుడిని నిందించిన పరిస్థితుల నుంచి ఈ జాతీయం ఆవిర్భవించింది. అలా అలా అది ప్రచారంలోకి వచ్చి ప్రస్తుతం ఏ పనీపాటా లేకుండా సోమరిపోతుగా ఉండేవాడిని చూసి 'ఆ... వాడా! ఒట్టి ఉడుతలు పట్టేవాడులెండి. వాడితో మనకెందుకు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

చిటికెలో

స్వల్ప వ్యవధిలో అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చేత్తో చిటిక వేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్దగా శ్రమించనవసరం లేదు కూడా. అంత తక్కువ శ్రమ, తక్కువ సమయాల్లో చేసే పనిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు 'అదే నేనైతేనా... ఆ పనంతా చిటికెలో చేసేస్తా" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

భుజానికెత్తుకోవడం

బాధ్యతలు స్వీకరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. బాధ్యతను బరువుతో పోల్చి చెబుతుంటారు. బరువుగా ఉన్నదాన్ని భుజంమీదకు ఎత్తుకొని ముందుకు సాగడం సాధారణంగా జరిగేపని. ఈ భావం ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ప్రస్తుతం ఆ ఇంటి బాధ్యతనంతా అతడే భుజానికెత్తుకున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.

ఉక్కుపాదం

ఉక్కుపాదం మోపడం, తీవ్రంగా అణచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఉక్కు కఠినమైన లోహం అనే భావం ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. మాములుగా మనిషి పాదంతో అణిస్తే కొన్నిమాత్రమే అణిగిపోతాయి. అదే ఉక్కుతో సమానశక్తి ఉన్న పాదంతో అణిస్తే కఠినమైనవి కూడా అణిగిపోయే వీలుంటుంది. అందుకనే "తీవ్రవాద సమస్యపై ఉక్కుపాదం మోపి తమ సత్తా నిరూపించుకుంటామని ఆ పోలీసు అధికారి ప్రకటించారు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మగవాళ్లు

పౌరుషం అనేది మగజాతి లక్షణమని నమ్మిన నేపథ్యం నుంచి ఈ జాతీయం ఆవిర్భవించింది. అంటే పౌరుషం ఉన్నవాడే మగవాడు అని ఓ అర్థం ధ్వనించేలా ఈ జాతీయం కనిపిస్తుంది. శారీరకంగా ఉండే పురుష లక్షణాలుకాక మానసికంగా, స్వాభావికంగా ఉండే పౌరుష స్వభావానికే ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. "మీరంతటి మగవాళ్లయితే మరో రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఈసారి ఎన్నికల్లో గెలవండి చూద్దాం అని ఆయన అన్నాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

మెరుగు తగ్గడం

గొప్పతనం నశించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏదో ఒక ప్రత్యేకతతో నలుగురి ముందు గొప్పగా ఉన్న వ్యక్తి ఏ కారణం చేతనో ఆ గొప్పతనం అంతా పోయి మాములుగా మారిన సందర్భంలో ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది. 'ప్రస్తుతం ఆయన మెరుగు తగ్గింది. ఆయన మాట వినేవారెవరూ లేరు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడడం కనిపిస్తుంది.

డొల్లకబుర్లు

పసలేని మాటలు, కాలక్షేపానికి చెప్పే మాటలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. డొల్ల కావటమంటే లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం. చెప్పే కబుర్లలో కూడా పనికొచ్చే విషయాలు ఏవీ లేనప్పుడు వాటిని డొల్లకబుర్లు అంటారు. 'డొల్లకబుర్లను ప్రజలు ఎంతో కాలం నమ్మరు. ఈసారి ఎన్నికలలో ఆ డొల్ల కబుర్లు చెప్పిన నాయకులందరినీ ఓడించి తీరుతారు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం విన్పిస్తుంది.

హేమాహేమీలు

హేమాహేములు అనే రూపంగా కూడా కనిపించే ఈ జాతీయం అన్నింటా గొప్పవారు, సమర్థులు అనే అర్థంలో వ్యవహారంలో ఉంది. కొన్నిచోట్ల మోసగాళ్లనే అర్థంలో కూడా వాడడం జరుగుతోంది. ఇవి ఎవరైనా ఇద్దరికి సంబంధించిన పేర్లా? అసలీ హేమా హేముడు అనేవారు ఉన్నారా? వారివల్లనే ఈ జాతీయం వచ్చిందా? అనేవాటిని గురించి ఇంకా పండితలోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కడు సమర్థులు, అందరికంటే గొప్పవారు అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వారికేమండీ హేమాహేమీలు, ఎలాంటి పనినైనా సాధించగలరు' అనేలాంటి ప్రయోగాలు గమనార్హం.

గుదిబండ

స్వేచ్ఛను అడ్డుకునేది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పశుపోషణ చేసేవారి వ్యవహారంలో మొదలై ఇది సమాజమంతటా వ్యాపించింది. కొన్ని గేదెలు, దున్నలు లాంటివి మాములుగా నడవక ఎలాపడితే అలా పరుగెడుతూ ఉంటాయి. వాటిని కాసే వ్యక్తులను అవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి వేగాన్ని నిరోధించడానికి వాటి మెడలో ఒక బరువైన చెక్క కొయ్యను నేలమీద ఆనేలా, వాటి కాళ్ల మధ్య ఉండేలా కడతారు. దాంతో అవి పరుగెత్తడానికి వీలుండదు. పరుగెత్తడానికి ప్రయత్నం చేస్తే కాళ్లకు గుదిబండ తగిలి కిందపడతాయి. అందువల్ల ఆ పశువులు తప్పనిసరిగా చిన్నగానే నడుస్తూ పోతాయి. దీని ఆధారంగానే స్వేచ్ఛను నిరోధించే అంశం ఏదివున్నా దాన్ని ఈ జాతీయంతో పోల్చిచెప్పడం కనిపిస్తుంది. అలాగే మాటిమాటికీ ఒకరు మరొకరికి అడ్డుపడుతూ వారి అభివృద్ధిని నిరోధించడమో, లేక వారు చేయాల్సిన పనులను అడ్డుకుంటూ ఉండడమో చేస్తున్నప్పుడు కూడా ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనార్హం. 'ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఆయనకు ఓ పెద్ద గుదిబండలా మారింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడాన్ని గమనించవచ్చు.

సుడిగాలి పర్యటన

ఆకస్మిక పర్యటన అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలి మాములుగా వీచే పద్ధతి వేరు. ఉన్నట్లుండి సుళ్లు తిరుగుతూ వచ్చి అంతలోనే వెళ్లి ఆగిపోవడమూ అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఈ సుడిగాలి వచ్చిన తీరులోనే కొంతమంది నాయకులు పర్యటనలు జరుపుతుంటారు. సమయాభావం వల్ల ఎక్కడా ఎక్కువసేపు ఉండే వీలులేనప్పుడు ప్రముఖ నాయకులు అలా చేయడం జరుగుతుంటుంది. 'జిల్లాలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన జరిగింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

చేయి పట్టడం

సమాజంలో ఉండే సంప్రదాయాలు కూడా జాతీయాల ఆవిర్భావానికి కారణాలయ్యాయని చెప్పడానికి ఈ జాతీయం ఓ ఉదాహరణ. వివాహ వ్యవస్థలో పాణిగ్రహణం ఓ సంప్రదాయం. దాని అర్థమే ఈ చేయి పట్టడం. వధూవరులు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతోటే వారికి వివాహ బంధం ఏర్పడుతుందన్న భావనతో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఎలాగైనా సరే ఆమె చేయి పట్టి, తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలన్నదే తన లక్ష్యమని అతను అంటున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

చీమదూరే సందు

స్వల్ప అవకాశం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చీమ దూరడానికి చాలా తక్కువ చోటు సరిపోతుంది. అంత తక్కువ అవకాశం అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఒక పోలికగా వాడుతుంటారు. 'చీమ దూరేంత సందు దొరికితే చాలు, నీకు చేయాల్సిన సహాయమంతా చేసేస్తాను' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

వీరాభిమాని

వీరశబ్దం మితిమీరిన, అధికం అనే అర్ధాలలో వాడుకలో ఉన్న కారణంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. అభిమానులు చాలా మంది ఉండొచ్చు. కానీ వారిలో మరింత అభిమానం ఉన్నవాడిని ప్రత్యేకంగా పేర్కొనటానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. 'వాడు ఆయన వీరాభిమాని. ఆయన గురించి వాడి ముందు చెడుగా అనొద్దు సుమా' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం గమనార్హం.

లోకం తెలియనివాడు

అమాయకుడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. లోకంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతే మోసపోవడం జరుగుతుంది. అలాంటివారిని ఉద్దేశించి ఈ జాతీయం వాడతారు. 'వాడంటే చిన్నవాడు, లోకం తెలియనివాడు. కానీ అన్నీ తెలిసిన నీవు కూడా ఇలా చేయడం బాగోలేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

మబ్బులు వీడడం

అపార్థాలు తొలగడం అనే అర్థంలో ఈ జాతీయ ప్రయోగంలో ఉంది. మబ్బులు కమ్మినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్న సూర్యుడైనా, చంద్రుడైనా కాంతి తగ్గడం సహజం. ఇద్దరి మధ్య అపార్థాలు కలిగినప్పుడు వారి మనసుల్లో ఉండే ప్రేమానురాగాల కాంతి కూడా మబ్బుల్లాంటి అపార్థాల వల్ల వన్నె తగ్గినట్టవుతుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఆ ఇద్దరి మధ్యన అలముకొన్న మబ్బులు విడిపోయి ఇద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కన్పిస్తుంది.

కుక్కల దొడ్డి

కుక్కలను భద్రత కోసమో, ముద్దు కోసమో పెంచుకునే వారు అవి ఉండే ప్రదేశాలను చాలా పరిశుభ్రంగా ఉంచే మాట నిజమే కానీ ఈ జాతీయ ఆవిర్భావానికి కారణమైన కుక్కల దొడ్డి మాత్రం దానికి విరుద్ధంగానే ఉంటుంది. ఊరకుక్కలు తమ ఆహారం కోసం కొట్లాడుకుంటూ తిరిగే ప్రదేశం చిందరవందరగా, అపరిశుభ్రంగా ఉంటుంది. ఊరకుక్కలు ఉండే ప్రాంతం (దొడ్డి) మాదిరి అపరిశుభ్రంగా ఎక్కడైనా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఇది ఇల్లా, కుక్కల దొడ్డా!' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

లొట్టలేయడం

బాగా ఆనందించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, నాలుకను తాడించడం లాంటివి జరుగుతాయి. దేహసంబంధమైన ఈ చర్యల ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ఎంతో ఆనందంగా ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తున్నప్పుడు... 'లొట్టలేసుకుంటూ తిన్నాడు..., లొట్టలేసుకుంటూ తిరుగుతున్నాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

సున్నా చుట్టడం

నిలిపివేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చెయ్యాల్సిన పనులన్నిటినీ ఒక వరుసక్రమంలో రాసుకుని ఏది ముందు, ఏది వెనుక చేయాలి, దేన్ని చెయ్యకుండా వదిలేయాలి అని ఆలోచించేటప్పుడు చెయ్యకుండా వదిలేయాల్సిన పని దగ్గర సున్నా చుట్టడం ఓ అలవాటుగా చాలా మందిలో కనిపిస్తుంది. ఈ అలవాటును ఆధారం చేసుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'చెడు స్నేహాల ప్రభావంతో చదువుకు సున్నా చుట్టేసి అలా తయారయ్యాడు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

కొంగు ముడేయడం

వివాహం జరిపించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'పల్లూ బాంధ్‌నా' అని దీనికి సామ్యంగా హిందీ భాషలో కూడా జాతీయం ఉంది. సంప్రదాయబద్ధంగా ఉన్న కొన్ని విషయాలు జాతీయాలయ్యాయి అనడానికి ఇదొక ఉదాహరణ. వధూవరుల కొంగులను వివాహ సమయంలో ముడివేయడం ఓ సంప్రదాయం. 'ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ కొంగుముడేయాలని అనుకుంటున్నాం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=జాతీయములు&oldid=86545" నుండి వెలికితీశారు