(Translated by https://www.hiragana.jp/)
Moral story: మంత్రి అనుమానం... రాజు వ్యూహం | vishwadatta-was-honored-by-maharaja-vikramasena

Moral story: మంత్రి అనుమానం... రాజు వ్యూహం!

విక్రమపురి రాజ్యాన్ని పరిపాలించే విక్రమసేనుడు, సైన్యాధిపతి విశ్వదత్తు అడవికి వేటకు వెళ్లారు. తర్వాత చీకటి పడటంతో తిరుగు ప్రయాణమైన సమయంలో.. ఒక ఎలుగుబంటుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. విక్రమసేనుడు ఒకవైపు, విశ్వదత్తు మరోవైపు చెల్లాచెదురయ్యారు.

Published : 24 Jun 2024 00:23 IST

విక్రమపురి రాజ్యాన్ని పరిపాలించే విక్రమసేనుడు, సైన్యాధిపతి విశ్వదత్తు అడవికి వేటకు వెళ్లారు. తర్వాత చీకటి పడటంతో తిరుగు ప్రయాణమైన సమయంలో.. ఒక ఎలుగుబంటుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. విక్రమసేనుడు ఒకవైపు, విశ్వదత్తు మరోవైపు చెల్లాచెదురయ్యారు. కొంత సమయం తర్వాత విశ్వదత్తు విక్రమపురి వచ్చేశాడు. విశ్వదత్తు ఒంటరిగా రావడం చూసి మంత్రి ధనశర్మ ఆశ్చర్యపడి ‘మహారాజు ఎక్కడ..?’ అని అడిగారు. 

విశ్వదత్తు, మంత్రితో... ‘మేము వేట ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు మాపై ఎలుగుబంటుల గుంపు దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి మేం చెరో వైపు వెళ్లిపోయాం. నేను అడవి అంతా గాలించాను. మహారాజు ఆచూకీ దొరకలేదు. రాజ్యానికి చేరిపోయి ఉంటారని తలచి, నేనూ వచ్చేశాను. మహారాజు రాజ్యానికి చేరలేదా?’ అని అడిగాడు. 

‘అయ్యో! ఎంత పని జరిగింది. మహారాజు రాజ్యానికి రాలేదు’ అని మంత్రి చెప్పడంతో విశ్వదత్తు వెంటనే కొంతమంది భటులను వెంటబెట్టుకొని, కాగడాలు సిద్ధం చేసి అడవికి బయలుదేరాడు. అడవి అంతా జల్లెడ పట్టినా.. రాజు ఆచూకీ దొరకలేదు. నిరాశతో విశ్వదత్తు రాజ్యానికి చేరాడు. రాజు అడవిలో ఎలుగుల దాడికి గురయ్యారన్న వార్త రాజ్యమంతటా విస్తరించింది. 

విశ్వదత్తు వచ్చేటప్పటికి రాజమాత వైష్ణవి దేవి, మంత్రి ధనశర్మ, ఇంకా కొంతమంది రాజకుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. రాజు ఆచూకీ దొరకలేదన్న సంగతి తెలిసి, రాజ్యమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. వారం రోజుల పాటు అడవిని ఆ చుట్టుపక్కల ప్రాంతాలను రాజు ఆచూకీ కోసం గాలించారు. కానీ ప్రయోజనం లేదు. మంత్రి ధనశర్మ, రాజమాతతో రాజుతోపాటు వేటకు వెళ్లిన విశ్వదత్తుపై అనుమానం వెలిబుచ్చాడు. 

రాజమాత మంత్రితో.. ‘ఈ విషయం బయటకు చెప్పకండి. అంతరంగికుల ద్వారా విచారిద్దాం. మన వేగులను ఒకసారి నన్ను రహస్యంగా కలవమనండి’ అని ఆదేశాలిచ్చారు. సైన్యాధిపతి విశ్వదత్తు చీకటి పడిన తర్వాత ఒక ఆగంతకుడిని వెంటబెట్టుకుని రాజమాత వైష్ణవి దేవి దగ్గరకు వచ్చాడు. రాజమాతతో వారు చాలాసేపు మాట్లాడారు. మరునాడు రాజమాత సభను సమావేశపరిచింది. ఇంతలో మంత్రి ధనశర్మ హడావుడిగా ఆయాసపడుతూ వచ్చి రాజమాతతో..  ‘అడవిని మరోసారి గాలించాం. అక్కడ ఒక మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా కనిపించింది. దాని పక్కన మన మహారాజు ధరించిన ఆభరణాలు ఉన్నాయి’ అని చెప్పాడు. ఒక్కసారి సభలో ఉన్న అందరూ విచారంలో మునిగిపోయారు. సభలో నిశ్శబ్దం రాజ్యమేలింది.

రాజమాత గొంతు సవరించుకొని సైన్యాధిపతి విశ్వదత్తును పిలిచి.. ‘వెంటనే మంత్రి ధనశర్మను బంధించండి’ అని ఆజ్ఞాపించింది. రాజమాత ఆజ్ఞ వినడంతో సభ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. విశ్వదత్తు ముందుకు వచ్చి మంత్రి ధనశర్మను బంధించాడు. రాజమాత, విశ్వదత్తుతో... ‘నిన్న రాత్రి నా దగ్గరికి తెచ్చిన ఆగంతకుడిని సభలో ప్రవేశపెట్టండి’ అని ఆజ్ఞాపించింది. విశ్వదత్తు ఆగంతకుడిని సభలో ప్రవేశపెట్టాడు. అతడు ఎవరో కాదు... విక్రమపురి మహారాజు విక్రమసేనుడే. సభలో ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, తర్వాత ఆనందపడ్డారు. 

‘మీరు శత్రురాజ్యంతో చేతులు కలిపి, నాపై వారి సైనికులతో ఎలుగుబంటి రూపంలో దాడి చేసి చంపించడానికి పథకం పన్నారు. అదృష్టం కొద్దీ నేను ఆ దాడి నుంచి తప్పించుకున్నాను. విశ్వదత్తు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాడు. వెన్ను చూపని ధైర్యంతో అతడు కత్తి ఝుళిపించడంతో మీ బండారం బయటపడింది. ఎలుగుబంటి వేషంతో మాపై దాడి చేసిన అందరినీ మేము బందీలుగా పట్టుకున్నాం. వారిని విచారిస్తే మీ పేరు, మీరు చేస్తున్న రాజద్రోహం బయటపడింది. మీ వంటి నమ్మకద్రోహుల సంగతి పూర్తిగా తెలుసుకోవాలని, ఇన్ని రోజులు విశ్వదత్తు సహకారంతో నేను అజ్ఞాతంలో గడిపాను. మీరు చేసిన తప్పులను గుర్తు చేసుకొని బాధపడుతూ చెరసాలలో గడపండి’ అని విక్రమసేనుడు బందీగా ఉన్న మంత్రితో అన్నాడు. మంత్రి ధనశర్మ సిగ్గుతో తలదించుకున్నాడు. రాజు మంత్రిని చెరసాలలో వేయించాడు. విశ్వదత్తుకు మహారాజు విక్రమసేనుడు కానుకలిచ్చి సత్కరించాడు.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు