(Translated by https://www.hiragana.jp/)
Donald Trump: ఆమె బైడెన్‌కు బీమా పాలసీ లాంటిది: ట్రంప్‌ ఎద్దేవా | donald-trump-calls-kamala-harris-as-an-insurance-policy-for-joe-biden

Donald Trump: ఆమె బైడెన్‌కు బీమా పాలసీ లాంటిది: ట్రంప్‌ ఎద్దేవా

జోబైడెన్‌-కమలా హ్యారిస్‌లను ఉద్దేశించి రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ పదునైన విమర్శలు చేశారు. 

Published : 10 Jul 2024 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ట్రంప్‌ (Donald Trump)విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా ఆయన అధ్యక్షుడు జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ( Kamala Harris)ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను జోబైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రటిక్‌ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

జూన్‌ 27వ తేదీన జరిగిన చర్చా కార్యక్రమంలో జోబైడెన్‌ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ట్రంప్‌ మాట్లాడుతూ ‘‘వంకర బుద్ధి జోబైడెన్‌ను ఓ విషయంలో మెచ్చుకోవచ్చు. కమలా హ్యారిస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్‌ ఇన్స్యూరెన్స్‌ పాలసీ కావచ్చు. కనీసం సగం సమర్థుడినైనా ఎంపిక చేసుకొని ఉంటే.. కొన్నేళ్లక్రితమే బైడెన్‌ను వారు ఆఫీస్‌ నుంచి సాగనంపేవారు. కానీ, ఇప్పుడు కమలా ఆ స్థానంలో ఉండటంతో ఇక ఎవరూ పంపలేరు’’ అంటూ ఎద్దేవా చేశారు. 

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రభుత్వంలో రెండు కీలక అంశాలు అప్పజెప్పారని ట్రంప్‌ వెల్లడించారు. వీటిల్లో ఒకటి బోర్డర్‌ సెక్యూరిటీ కాగా.. రెండోది ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడమని పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదన్నారు. కనీసం బోర్డర్‌కు కూడా వెళ్లలేదని ట్రంప్‌ ఆరోపించారు. భూప్రపంచంలో అత్యంత చెత్త సరిహద్దులుగా అవి మారిపోయాయని పేర్కొన్నారు. తన పాలనలో వాటిని అద్భుతంగా కాపాడినట్లు గుర్తు చేశారు. 

ఉక్రెయిన్‌పై దాడిని ఆపేందుకు కమలాను ఐరోపాకు పంపించారని ట్రంప్‌ పేర్కొన్నారు. అది కూడా ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. రెండుసార్లూ ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయని పెదవి విరిచారు. కమలా-బైడెన్‌లు సరిహద్దుల విషయంలో తీవ్రంగా విఫలమయ్యారన్నారు. వీరి కారణంగా 1,50,000 మంది పిల్లల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని